కోరుట్ల, మార్చి 13: ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్(Collector Satya Prasad) అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లతో ఆస్తి పన్ను , ఎల్ఆర్ఎస్ ఫీజు వసుళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పర్యటించిన కలెక్టర్ పలు షాపింగ్ మాల్ లో అత్యధిక ఆస్తి పన్నులు బకాయిపడ్డా షాప్ యజమానులతో మాట్లాడారు. రెండు రోజుల్లోగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించనిచో షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజలు మార్చి 31 లోగా ఆస్తి పన్ను చెల్లించి పట్టణ పురోభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటి వరకు కోరుట్ల పట్టణంలో 80 శాతం ఇంటి పన్నులు వసూలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
గడువులోపు 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు పటిష్ట కార్యచరణ రూపొందించాలని పేర్కొన్నారు. ఈనెల 31 వరకు 25 శాతం రాయితీ వినియోగించుకొని ప్లాట్ల యజమానులు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లించిన వెంటనే సర్టిఫికెట్స్ జారీ చేస్తామని చెప్పారు. వార్డు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి ప్రతి ఒక్క దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి తప్పనిసరిగా మార్చి 31 లోపు ఫీజు చెల్లించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జివాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, మున్సిపల్, రెవిన్యూ అధికారులు ఉన్నారు.