జగిత్యాల, మే 6: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోసం అడ్డగోలు హమీలిచ్చి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసగించాడని, వెంటనే ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. అడ్డగోలు హామీలిచ్చి తీరా ఏడాది గడిచాక ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నారన్నారని మండిపడ్డారు. రైతులకు ఏడాదికి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు. రెండు పంటలు గడిచినా జాడలేదన్నారు.
లక్ష రుణమాఫీ, 5 వందల బోనస్ అంటూ రైతులకు ఆశలు కల్పించి కాంగ్రెస్ పార్టీ మోసగించిదన్నారు. ఏడాదిన్నర కాలంలో ఐదు వందల మంది రైతులు చనిపోతే రైతు బీమా ఇవ్వలేదన్నారు. గృహజ్యోతి, మహాలక్షి పథకాల కింద ఐదు వందలకే సిలిండర్, 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 2 వేల 5 వందల నగదు, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని సత్యనారాయణ అన్నారు.
ఇలా ఎన్నో హామీలను ఇచ్చి వాటన్నిటిని ఎగొట్టడం, ప్రజలను మోసాగించడం బాధాకరమన్నారు. ఇలా స్వార్థం కోసం ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. అయన వెంట బిజెపి అధికార ప్రతినిధి మర్రి పెల్లి సత్యం, జిల్లా కోశాధికారి సుంకేటి దశరథం తదితరులు ఉన్నారు.