Jagtial | జగిత్యాల : అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఓ రైతు తన పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. ఆ విద్యుత్ తీగలు తగలడంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండల పరిధిలోని మారేడుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామస్తుల కథనం ప్రకారం.. కోట కనకయ్య అనే కౌలు రైతు.. అడవి పందుల నుంచి తన పంటను కాపాడుకునేందుకు చుట్టూ విద్యుత్ తీగలను ఏర్పాటు చేశాడు. ఈ విషయం గ్రహించిన ఓ వ్యవసాయ కూలీ.. పొలంలోకి ప్రవేశిస్తుండగా, ఆ విద్యుత్ తగిలాయి. దాంతో విద్యుత్ షాక్కు గురై కూలీ బింగి సతీష్(35) ప్రాణాలు కోల్పోయాడు. సతీష్ పత్తి చేనుకు మందులు కొట్టేందుకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.