హనుమకొండ, ఫిబ్రవరి 28 : ‘కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులు, భూ నిర్వాసితులకే ఉద్యోగాలు ఇవ్వాలి. లేదంటే ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటాం. ఢిల్లీ వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించడంతోనే ఎన్నో ఏళ్ల కోచ్ ఫ్యాక్టరీ కల సాకారమైంది. కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు’ అని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ‘కొలువుల కోసం కొట్లాట’ పేరిట బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ అధ్యక్షతన శనివారం కాజీపేట చౌరస్తాలో జరిగిన మహాధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక యువతకు ఉద్యోగాల సాధన కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వినయ్భాసర్ను ప్రత్యేకంగా అభినందించారు. 50 ఏండ్ల పోరాట ఫలితంగా కేసీఆర్ ఆధ్వర్యంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సాధించామన్నారు.
కేసీఆర్ కేవలం రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానిక యువతకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలివ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని దేవాదాయ శాఖకు చెందిన 150 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించిందన్నారు. అంతేకాకుండా కోచ్ ఫ్యాక్టరీ సాధనకు నాడు బీఆర్ఎస్ ఎంపీలు రైల్వే మంత్రిని కలవడమే కాకుండా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు. ఆ రోజు కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదన్న కేంద్ర ప్రభుత్వం.. తర్వాత అసోం, లాథూర్‌కు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసి తెలంగాణకు మొండిచేయి చూపిందన్నారు.
బీఆర్ఎస్ ఒత్తిడితో వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారని, ఇప్పుడు ఇక్కడ ఇకడుతున్నది కోచ్ ఫ్యాక్టరీనా? వ్యాగన్ పరిశ్రమనా? అనేది స్పష్టతనిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని లాథూర్ వ్యాగన్ ఫ్యాక్టరీలో 70 శాతం స్థానికులకే రిజర్వేషన్ ఇచ్చి కాజీపేటలో ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర మంత్రులు ప్రారంభిస్తామంటున్నారని, ముందుగా భూ నిర్వాసితులు, స్థానిక యువతకు 70 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా వస్తే బీఆర్ఎస్ పక్షాన ఎక్కడికక్కడే అడ్డుకుంటామని, నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.
లాథూర్ మాదిరిగానే ఇక్కడ స్కిల్ డెవలప్ సెంటర్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేలా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలన్నారు. దాస్యం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పక్షాన త్వరలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి ఇచ్చినట్లుగానే కాజీపేటను తక్షణమే రైల్వే డివిజన్‌గా ప్రకటించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాజీపేటలో స్థానికుల ఉద్యోగాల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, ఈ అంశంపై రాజ్యసభలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

Warangal
ఢిల్లీ దాకా పోరాడుతాం..
కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమ ఫలితంగానే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ప్రజల పోరాటంతో 1982లో కేంద్ర ప్రభుత్వం వరంగల్‌కు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసింది. ఆ తర్వాత 30 రైల్వే బడ్జెట్లు వచ్చినా ఫ్యాక్టరీ ప్రస్తావన రాలేదు. ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీకి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఒకోసారి ఒకో మాట చెప్పింది. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం150 ఎకరాల భూమిని సేకరించి రైల్వే శాఖకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసింది.
తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్థానికులకు ఉద్యోగాలిచ్చేలా జీవో వచ్చేందుకు ఒత్తిడి చేయాలి. ఈ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగావకాశాల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడుతాం. హకులు సాధించే వరకు ఉద్యమిస్తాం. ఇకడి యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైతే శిక్షణ ఇవ్వాలి. ఓరుగల్లుకు ఉద్యమ, చారిత్రక నేపథ్యం ఉంది. ఇకడి ప్రజలకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఉద్యోగాల కల్పనలో అన్యాయం జరిగితే కచ్చితంగా తిరగబడతాం. కాజీపేట రైల్వేలో వర్తక, వ్యాపార నిర్వహణలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయొద్దు.
-దాస్యం వినయ్‌భాస్కర్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
కాంగ్రెస్ పాలనలో రోడ్డునపడ్డ ఆటో డ్రైవర్లు
కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారన్నారు. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటివరకు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నాడు కేసీఆర్ ఆటో డ్రైవర్లకు ట్యాక్స్ రద్దు చేయడంతో పాటు రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించారన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి కళ్లు తెరిచి ఆటో డ్రైవర్ల డిమాండ్లను నెరవేర్చాలని, వారికి ఆర్థిక సాయం చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అనంతరం కాజీపేట ఫాతిమానగర్‌లో బాలవికాస తాగునీటి శుద్ధీకరణ పథకం కమిటీ సభ్యుల మహాసభలో పాల్గొని మాట్లాడారు. బాలక్క చేసిన పనులు ఎంతో అద్భుతమని, బాలవికాస వాటర్ ప్లాంట్ పెట్టడంతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వాటిని ఎలా నిర్వహించాలో శిక్షణ ఇస్తున్నదన్నారు.
సమర్థ నాయకత్వం అనేది కేవలం అధికారాన్ని నిర్వహించడం కాదని, ప్రతి వర్గాన్ని, ప్రతి వ్యక్తిని కలుపుకొని ముందుకు నడిపించే దృక్పథమన్నారు. తన సిద్దిపేట నియోజకవర్గంలో స్థాపించిన ప్లాంట్ 20 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేశ్, శంకర్‌నాయక్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు బీరెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, హరి రమాదేవి, ఎల్లావుల లలితాయాదవ్, పులి రజినీకాంత్, పోలపల్లి రామ్మూర్తి, జానకిరాములు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రభుత్వాలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. దక్షిణ భారతదేశాన్ని ఏలిన కాకతీయ సామ్రాజ్యం ముఖ్య పట్టణం ఓరుగల్లు. నాడు కేసీఆర్ నేతృత్వంలో చేసిన పోరాటంతోనే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైంది. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. అందులో భాగంగానే కోచ్ ప్యాక్టరీ ఏర్పాటైంది. కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలి. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందించడం లేదు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. అలాగే కాజీపేటను రైల్వే డివిజన్ చేయాలి. వ్యాపార అవకాశాల్లోనూ స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– సిరికొండ మధుసూదనాచారి, శాసన మండలి ప్రతిక్షనేత