టెహ్రాన్, ఫిబ్రవరి 28: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి స్థాయిలో ఘర్షణలు మొదలయ్యాయన్న వార్తతో యావత్ ప్రపంచం శనివారం తెల్లవారుజామున నిద్రలేచింది. మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమాసియా వ్యాప్తంగా ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. దుబాయ్ నుంచి దోహా దాకా అయితే ఒమన్ ఒక్కటి మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. పశ్చిమాసియా స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన ఒమన్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయలేదు.
ఒమన్‌లో సుల్తాన్ ఖబూస్ బీన్ సయిద్‌పై ధోఫర్ తిరుగుబాటు సందర్భంగా మావోయిస్టు తిరుగుబాటుదారులను ఓడించేందుకు ఇరాన్ షా వేలాదిమంది ఇరానియన్ బలగాలను ఒమన్‌కు పంపించారు. అదే ఆ తర్వాత మస్కట్, టెహ్రాన్ మధ్య భద్రతా బంధాన్ని బలోపేతం చేసింది. దశాబ్దాలుగా ఆ బంధం కొనసాగుతూనే ఉంది. 1979 ఇరాన్ విప్లవం తర్వాత కూడా ఇతర గల్ఫ్ రాజ్యాలు ఇరాన్ వంక అనుమానంగా చూసినా ఒమన్ మాత్రం తన బంధానికి కట్టుబడే ఉంది.
ఒమన్ తటస్థ విదేశాంగ విధానం ప్రస్తుత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలో పనిచేస్తున్నది. ఇరాన్, దాని ప్రత్యర్థుల మధ్య అనేక సందర్భాలలో నిశ్శబ్ద మధ్యవర్తిగా వ్యవహరించింది.
ఇరాన్ దృష్టిలో ఒమన్‌పై దాడి చాలా ఖరీదైన జూదం. ఇలాంటి సమయాల్లో కూడా కమ్యూనికేషన్ మార్గాలను తెరిచి ఉంచే అతి కొద్ది గల్ఫ్ దేశాల్లో ఒకదాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది. అంతేగాక ఈ రెండు దేశాల మధ్య భౌగోళిక సమస్య కూడా ఉంది. ఒమన్, ఇరాన్ సంయుక్తంగా ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం హొర్ముజ్ జలసంధిని పర్యవేక్షిస్తున్నాయి. ఈ జలమార్గంలో స్థిరత్వం రెండు దేశాలకు అవసరం. గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఇరాన్‌కు ఒమన్ చాలా కీలకమైన భాగస్వామి.