Congress Govt | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 4 : అధికారమే ధ్యేయంగా అలవి కానీ హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలు చేయకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి రాగానే తూచ తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారమే సంక్షేమం సాగుతుందని ప్రకటించిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఆ ప్రకటనను విస్మరించాడనే విమర్శలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉంటున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలను కూడా పట్టించుకోకపోవటం పట్ల ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇచ్చిన మాట అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం ఓట్లేసిన ప్రజలను మోసం చేస్తున్నదనే ఆవేదన వెలిబుచ్చుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ముఖ్యంగా ఫించన్ దారులు, వృద్ధులు, వికలాంగులు మనోవేదనకు గురవుతుండగా.. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత పెన్షన్ రెండింతలు చేస్తామంటూ మేనిఫెస్టో ద్వారా ప్రకటించటంతో ఆశపడి మద్దతిస్తే, ఏడాదిన్నర గడుస్తున్నా పెన్షన్ పెంపుపై స్పందన లేదని వాపోతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వమే తమకు అండగా నిలిచిందని..
తమను మభ్యపెట్టి ఓట్లేయించుకున్న స్థానిక నాయకులను ప్రశ్నిస్తే, మొండిచేయి చూపుతున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే తమకు అండగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్నులను ఆదుకునే క్రమంలో రూ.2,016 కు పింఛన్లు పెంచి, తమను ఆదరించాడని కొనియాడుతున్నారు. ప్రస్తుతమున్న ఫించన్ రెట్టింపు చేసి చేయూత పేరిట రూ.4 వేల చొప్పున ఇంట్లో ఇద్దరికి ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ పంపిణీ చేసిన మొత్తాన్నే అందజేస్తున్నది. ఇచ్చిన హామీలపై ఎప్పటికప్పుడు మభ్యపెడుతుండగా, ఈ నెలలోనైనా తమ పింఛన్ పెరిగిందా అంటూ అధికారులను దైన్యంగా వేడుకోవటం పరిపాటిగా మారింది.
జిల్లాలో ప్రస్తుతం 1,35,881 మంది వివిధ రకాల పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో 53,791 మంది వృద్ధులు, 37,221 మంది వితంతువులు, 2,706 చేనేత, 3,680 మంది గీత, 9,546 మంది బీడీ కార్మికులు, 3,427 మంది ఒంటరి మహిళలు, 54 మంది బీడీ టేకేదార్లు, 2003 మంది ఏఆర్టీ, 538 మంది ఫైలేరియా, 118 మంది డయాలసిస్ పేషెంట్లు, 22,797 మంది వికలాంగులు ఉన్నారు. వీరందరికి ప్రస్తుతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ మాత్రమే అందుతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సంక్షేమ రంగంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్నది.
కేసీఆర్ హయాంలో సామాజిక బాధ్యతగా పింఛన్ల పంపిణీ..
అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తికరంగా సంక్షేమ ఫలాలు అందేలా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయనడంలో సందేహం లేదు. ప్రధానంగా కేసీఆర్ హయాంలో పింఛన్ల పంపిణీని సామాజిక బాధ్యతగా తీసుకొని దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా ఇక్కడ అమలు చేశారు. ఏ దిక్కూలేని వారందరినీ పింఛన్ల పరిధిలోకి తీసుకొచ్చి కేసీఆర్ కొండంత అండగా నిలిచారు. పెరుగుతున్న ధరలతో పెన్షన్ దారులు పడుతున్న ఇబ్బందులు గమనించి, కేసీఆర్ 2018 శాసనసభ ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్లు పెంచాలని నిర్ణయించారు.
దివ్యాంగులకు రూ.3,016, ఇతర పెన్షన్ దారులకు రూ.2,016 చొప్పున పింఛను అమలు చేశారు. అంతేకాకుండా గతంలో 65 ఏళ్ళు ఉన్నవారికి ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ 57 ఏళ్లకు కుదించి అమలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా, ఏడాదిన్నరలో 10 వేలకు పైగా కొత్త దరఖాస్తులు వచ్చాయి. వారు కూడా పెన్షన్ల మంజూరు కోసం వేచిచూస్తున్నారు. ఇప్పటివరకు వీటిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పెన్షనార్థుల్లో నైరాశ్యం అలుముకుంటున్నది.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు