హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమైందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్‌పై శుక్రవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె స్పందించారు. హైదరాబాద్‌లోని తన నివాసం బయట మీడియాతో మాట్లాడుతూ.. సత్యమేవ జయతే అంటూ నినదించారు. తీర్పును వెలువరించిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్పు దేవుడిచ్చిన వరమని అభివర్ణించారు.
అండగా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను జైలులో ఉన్న ఐదు నెలలు తన భర్త, పిల్లలు నరకం అనుభవించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏదేమైనా చివరకు నిజమే గెలిచిందని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కడిగిన ముత్యం లా బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. కష్టకాలంలో అండగా ఉన్నవారిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటానని అన్నారు.
స్వతంత్రతతో కూడిన శక్తిమంతమైన న్యాయవ్యవస్థ ఉన్నందు వల్లే దేశం ఎంతో ప్రశాంతంగా ఉన్నది. అదే లేకపోతే, దేశంలో అశాంతి రేగేది. కేజ్రీవాల్ నిర్దోషి అంటూ కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని అందరం అంగీకరించాల్సిందే.
-హక్కుల కార్యకర్త అన్నాహజారే
పంజాబ్, గుజరాత్ అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌కు క్లీన్చిట్ వచ్చింది. కాంగ్రెస్‌ను బలహీనపర్చడానికి బీజేపీ పన్నిన కొత్త కుట్ర ఇది. కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు వాళ్లు కంకణం కట్టుకొన్నారు. ఇందులో భాగంగానే.. ఒకవైపు కాంగ్రెస్ నాయకులపై కేసుల తీవ్రతను పెంచుతూనే, మరోవైపు తమ మిత్రులను (ఆప్) కాపాడుకొంటున్నారు.
-కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా
రాజకీయాల కోసం దర్యాప్తు సంస్థల సమగ్రతను బలి పెట్టడం బీజేపీకి ఎంతమాత్రం తగదు. ఇలా చేస్తున్నందుకు ఆ పార్టీ సిగ్గుపడాలి.
-తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
బీజేపీ దాని తోలుబొమ్మలైన ఈడీ, సీబీఐ ఎత్తులన్నీ సత్యం ముందు చిత్తయ్యాయి. సత్యమేవ జయతే.
– తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా
ఢిల్లీ ప్రజలను బీజేపీ అబద్ధాలతో మోసం చేసింది. కోర్టు తీర్పు ఆ పార్టీకి మరణశాసనమే
– ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్