హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తేతెలంగాణ): లిక్కర్ కుంభకోణమనేది కల్పితమని, రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు తీర్పుతో ఈ విషయం తేటతెల్లమైందని శుక్రవారం ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు. మద్యం కుంభకోణం సాకుతో కేంద్రంలోని బీజేపీ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేసిందని విమర్శించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కవితకు కోర్టులో న్యాయం జరిగిందని తెలిపారు. ఈ అక్రమ కేసు కారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది భారత రాష్ట్ర సమితి అని స్పష్టంచేశారు. సత్యం గెలిచేదాకా కాంగ్రెస్, బీజేపీ చేసిన బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను తాము భరించామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అసత్య, నిరాధార, కుట్రపూరిత కేసులు, ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవపట్టించి, తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యమిస్తూ, న్యాయప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ ‘నవ భారతం’ అలవాటుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఏదేమైనా తమ పార్టీ నేతలపై నమోదైన ప్రతి కేసూ అక్రమమని, రాజకీయ ప్రేరేపితం, కల్పితమని, అది త్వరలోనే తేలిపోతుందని స్పష్టంచేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కక్ష సాధింపునకు దిగినా చివరికి న్యాయమే గెలుస్తుందని తేల్చిచెప్పారు.