హోబర్ట్: ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్‌లో మాత్రం మరో మ్యాచ్ మిగిలుండగానే ప్రత్యర్థికి సిరీస్‌ను అప్పగించింది. ఇరుజట్ల మధ్య హోబర్ట్‌లో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య ఆసీస్.. 5 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనపై ఏకపక్ష విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 252 పరుగుల ఛేదనను ఆ జట్టు 36.1 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. జార్జియా వోల్ (82 బంతుల్లో 101, 13 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ శతకానికి తోడు ఓపెనర్ ఫొబె లిచ్‌ఫీల్డ్ (62 బంతుల్లో 80, 11 ఫోర్లు, 1 సిక్స్) టీ20 తరహా మెరుపులతో మెరిపించడంతో కంగారూలు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 50 ఓవర్లకు 251/9కే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (54), ప్రతీక రావల్ (52) అర్ధ శతకాలతో రాణించినా మిగిలిన బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అన్నాబెల్, అలానా కింగ్, ఆష్లీ గార్డ్నర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరుజట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే మార్చి 1న ఇదే వేదికలో జరుగుతుంది.