Serf Employees | కరీంనగర్ కలెక్టరేట్, మే 27 : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో సాధారణ బదిలీల పట్ల అధికారులు అనుసరిస్తున్న తీరు ఆ శాఖలోని ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఉద్యోగుల బదిలీలపై కసరత్తు మొదలుపెట్టిన ఆ శాఖ ఇందుకు సంబంధించిన విధివిధానాలు విడుదల చేయకుండానే, బదిలీ స్థానాలు కోరుకోవాలంటూ మెమో విడుదల చేయటం పట్ల ఆ శాఖలోని ఉద్యోగుల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
ఏ శాఖలోనైనా ఉద్యోగుల బదిలీల్లో అనుసరించాల్సిన గైడ్ లైన్స్ ముందుగా ప్రకటించి, సీనియార్టీ జాబితా విడుదల చేస్తారు. అనంతరమే వాటికనుగుణంగా ఆ శాఖలోని ఉద్యోగులు బదిలీ కోసం ప్రాధాన్యత స్థానాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా సెర్ఫ్ అధికారులు వ్యవహరిస్తుండటంతో బదిలీ ధరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నఆ శాఖలోని ఉద్యోగుల్లో అయోమయం నెలకొన్నది.
సెర్ప్ ఉద్యోగుల బదిలీలపై గత కొద్ది నెలలుగా నెలకొన్న సందిగ్ధానికి తెరదించుతూ.. ఈ నెల చివరి వారంలోపు బదిలీల ప్రక్రియ ముగిస్తామంటూ ఆ శాఖ సీఈవో దివ్య గత వారం రోజుల క్రితం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు వందశాతం బదిలీలు చేపడుతామని, ఇందుకవసరమైన విధివిధానాలకు కూడా రూపకల్పన చేస్తున్నామంటూ వెల్లడించింది. ఈ నెల మూడో వారంలో వాటిని ప్రకటించి, అనంతరం ఆప్షన్‌కు అవకాశం కల్పిస్తామంటూ అధికారులు పేర్కొన్నారు.
సీనియార్టీ జాబితా ప్రకటించలేదు..
మూడో వారం ముగిసి నాలుగోవారం గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా గైడ్‌లైన్స్ విడుదల చేయలేదు. సీనియార్టీ జాబితా ప్రకటించలేదు. కానీ తాము కోరుకుంటున్న మొదటి అయిదు స్థానాలు ప్రాధాన్యత క్రమంలో తెలియజేయాలంటూ ఈ నెల 28న మెమో నెం. 2878తో సెర్స్ సిఈవో ఉత్తర్వులు విడుదల చేశారు. ఎల్ (డిపిఎం), ఎల్5(అదనపు డిఆర్డివో) కేడర్‌కు చెందిన వారికి మొదటగా అవకాశం కల్పిస్తూ, మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈనెల 23 మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆప్షన్ ఫాం భర్తీ చేసి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు అందజేయాలంటూ సూచించారు.
అలాగే, వీటిని ఈనెల 30 ఉదయం 11 గంటల్లోపు ప్రత్యేక వ్యక్తి ద్వారా సెర్ఫ్ రాష్ట్ర కార్యాలయానికి పంపించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ విధివిధానాలు లేకుండా తాము ఎలా అప్షన్స్ ఇచ్చుకోవాలంటూ డీపీఎంలు, అదనపు డీఆర్డీవోలు ప్రశ్నిస్తున్నారు. తాము ఎంచుకున్న ప్రాధాన్యత జిల్లాల వివరాలు అధికారులకు అందజేసిన అనంతరం ఇందుకనుగుణంగా అధికారులు విడుదల చేసే విధివిధానాలు లేకపోతే తమ పరిస్థితేంటనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.
అలాగే, ఏపిఎంలు, సీసీల బదిలీలు కూడా చేపట్టనుండగా ఈ నెల 30 అనంతరం వారికి కూడా ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తుండగా అధికారుల తీరుతో ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగుల్లో కూడా ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్ర స్థాయికి చెందిన ఎల్4, ఎల్ 5 కెడర్ పోస్టుల్లో 200 మందికి పైగా డిపిఎంలు, 40మందికి పైగా అదనపు డిఆర్డివోలు బదిలీ కానున్నారు.
Rains | హైదరాబాద్‌కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్‌లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు