Metuku Anand | వికారాబాద్, మే 27 : ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ నెల 28న విచారణకు రావాలని ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ మంగళవారం ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాలోని డాలస్‌లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొంటారన్నారు. అలాగే లండన్‌లో జరిగే పలు కీలక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొననున్నారని తెలిపారు. ఈ నెల 30న లండన్‌లో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం చేయనున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ కేటీఆర్ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నదని… ఇది చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే అక్కడ జరిగే పార్టీ కార్యక్రమాలను ఆపడానికి కేటీఆర్ పర్యటనను రద్దు చేయాలని కుట్రపూరితంగా ఏసీబీ నోటీసులు జారీ చేసిందని మండి పడ్డారు.
ఇప్పటికే ఒకసారి కేటీఆర్‌ను ఏసీబీ ప్రత్యేక బృందం సుదీర్ఘంగా విచారించిందని… ఇది పూర్తిగా డమ్మీ కేసు అని తేలిపోయిందన్నారు. అయినప్పటికీ ఇలాంటి సమయంలో ACB నోటీసులు జారీ చేయడం ద్వారా కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోసమే పెట్టినట్టుగా మరోసారి స్పష్టమవుతుందని అన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, ప్రజలకు సమాధానం చెప్పలేక, BRS పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. అక్రమంగా కేసులను నమోదు చేస్తూ BRS పార్టీ నాయకులను భయపెట్టలేరని గుర్తుపెట్టుకోవాలని తెలియజే శారు. KTRకి మరోసారి ACB నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.