CP Sai Chaithanya | వినాయక్ నగర్, నవంబర్; 24 : నిజామాబాద్ జిల్లాలో మల్టీ లెవెల్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. అమాయక ప్రజలకు అధిక లాభం ఆశ చూపించి వాళ్ల వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ టోకరాకు పాల్పడుతున్నారు. యూపీ, బీహార్ లాంటి ఇతర రాష్ట్రాల ఫేక్ సంస్థలో జిల్లాకు చెందినవారు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ అమాయక ప్రజలను ఆ సంస్థలో సభ్యులుగా చేర్పిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఎంబీ పేరుతో కోటిన్నర రూపాయలు టోకరా వేసిన ఓ సంస్థ కు చెందిన ఏజెంటును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ మరో మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ కు చెందిన ఇద్దరు ఏజెంట్లను సోమవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జనాలకు టోకరా వేసిన ఏజెంట్ల వివరాలను వెల్లడించారు. ముబారక్ నగర్ ప్రాంతంలోని వీవీ నగర్ కాలనీకి చెందిన మేకల. జగదీష్, రెంజల్ మండలం సాటాపూర్ కు చెందిన పెద్ద బోయిన భూమయ్య అనే ఇద్దరు ఏజెంట్లు రేంజల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 150 మందిని సభ్యులుగా చేర్పించారు.
ఒక్కొక్క సబ్బుడి వద్ద నుండి రూ.25,500 చొప్పున డబ్బులు వసూలు చేసి సభ్యులుగా చేర్పించుకున్నారు. వారి వద్ద నుండి సుమారు రూ.75 లక్షలు వసూలు చేసి జనాలను మోసం చేసినట్లు సీపీ వెల్లడించారు. సాఠాపూర్ గ్రామానికి చెందిన పిట్ల మధు అనే బాధితుడు ఫిర్యాదు మేరకు రేంజర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై చంద్రమోహన్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జనాలను మోసం చేసిన ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీపీ పేర్కొన్నారు. జనాలు ఇలాంటి నకిలీ మల్టీ లెవెల్ సంస్థలను నమ్మి అధిక లాభాల ఆశతో డబ్బులు పెట్టి మోసపోవద్దని ఈ సందర్భంగా సీపీ సూచించారు.