Thongdok : చైనా (China) ఇమ్మిగ్రేషన్ అధికారులు (Immigration officials), చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (China Estern Airlines Corporation Ltd) అధికారులు షాంఘై ఎయిర్‌పోర్టు (Shanghai Airport) లో భారత మహిళ పెమా వాంగ్ థాంగ్డోక్ (Pema Wang Thongdok) ను వేధింపులకు గురిచేశారు. లండన్ (Landon) నుంచి జపాన్ (Japan) కు వస్తున్న ఆ అరుణాచల్‌ప్రదేశ్ (Arunachal pradesh) మహిళను చైనాలోని షాంఘై పుడోంగ్ ఎయిర్‌పోర్టులో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్ చైనాలో భాగమని, కాబట్టి ఆమె పాస్‌పోర్టు చెల్లదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
కొత్తగా చైనా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఒత్తిడి చేశారు. అంతేకాదు ఎయిర్‌పోర్టులో ఆమెను ఎక్కడికీ స్వేచ్ఛగా కదలనీయలేదు. ఆఖరికి ఆహారం కూడా ఇవ్వలేదు. ఇలా ఏకంగా 18 గంటలపాటు ఆమెను అడ్డుకున్నారు. చివరికి బాధితురాలి స్నేహితురాలు చైనాలోని భారత రాయబార కార్యాలయానికి విషయం చేరవేయడంతో.. వారు జోక్యం చేసుకున్నారు. ఇండియన్ ఎంబసీ జోక్యంతో బాధితురాలిని విడిచిపెట్టారు.
ఈ ఘటనపై సదరు మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వైరల్‌గా మారింది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు, అక్కడి ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు తనను వేధించారని, దాదాపు 18 గంటలపాటు తాను ఆ వేదనను భరించానని, ఆఖరికి ఇండియన్ ఎంబసీ జోక్యంతో వారు తనను విడిచి పెట్టారని పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్ చైనాలో భాగమని, ఇండియన్ పాస్‌పోర్టు చెల్లదని ఎగతాళి చేశారని పేర్కొన్నారు.