SIRICILLA | సిరిసిల్ల టౌన్, నవంబర్ 24: సెస్ కార్మికుల సమస్యలు పరిష్కరించనట్లైతే సమ్మె చేపడతామని తెలంగాణ స్టేట్ యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు అన్నారు. సెస్ సంస్థ పరిధిలో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్థా నుండి సెస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ముందు ధర్నా సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెస్ సంస్థలో పని చేస్తున్న అన్ని విభాగాలలోని ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కారుణ్యనియామక సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్నారు. అసిస్టెంట్ హెల్పర్లను జెఎల్ఎంగా పేరు మార్పు చేయాలన్నారు. ఒకే విభాగంలో, 8, 12, 18, 24 ఏండ్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు టిజిఎన్పిడిసిఎల్ లో అమలులో ఉన్న మానిటరీ బెన్ఫిట్స్ ఇవ్వాలన్నారు. అదేవిధంగా కార్మికులకు, ఉద్యోగులకు లీవ్ ఎన్ క్యాష్మెంట్ విధానం అమలుచేయాలని, ఎఫ్టిఎను పునరుద్దరించాలన్నారు.
పెరిగిన సర్వీసులకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. ప్రతి ఉద్యోగికి నాణ్యమైన రక్షణ పరికరాలు అందించాలన్నారు. సెప్టెంబర్-2025లో ఇవ్వాల్సిన ఆన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ వెంటనే చెల్లించాలన్నారు. తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు. లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలువాల స్వామి, సీఐటియు నాయకులు కోడం రమణ, మూషం రమేష్, సెస్ కార్మికులు, తదితరులున్నారు.