Duddilla Sridhar Babu | పెద్దపల్లి, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బంధంపల్లి స్వరూప గార్డెన్స్ లో సోమవారం ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు, ఓదెల మండలాలకు చెందిన మహిళ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈకార్యక్రమం ద్వారా మహిళల గౌరవం కాపాడే విధంగా నాణ్యమైన చీరలు అందిస్తున్నామన్నారు. ఆడబిడ్డలకు చీర సారె ఇచ్చి గౌరవించుకోవడం తెలంగాణ సాంప్రదాయమని కాబట్టి ప్రభుత్వం మహిళలకు ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరలు అందిస్తుందని అన్నారు. మహిళలు వృద్ధిలోకి రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని మహిళలు సంతోషంగా ఉంటే వారి కుటుంబం తద్వారా రాష్ట్రం కూడా సంతోషంగా ఉంటుందని తెలిపారు.
మహిళల వృద్ధికి తోడ్పాటు అందించేందుకు మహిళ శక్తి కార్యక్రమం ద్వారా వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, బస్సులు, మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లు, పాడి పరిశ్రమలు, మహిళా శక్తి క్యాంటీ లు, వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు ద్వారా వ్యాపారంలో మెలకువలు చేస్తున్నామని అన్నారు. మహిళ చేతిలో రూపాయి ఉంటే పొదుపు పెరుగుతుందని ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయిలో మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్య మంత్రి ఏ రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ఇందిరా మహిళ శక్తి చీరలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మహిళ సమాఖ్యలు ద్వారా ప్రతి మహిళకు చేరుతాయని తెలిపారు.
ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతంగా లేకున్నా ఇచ్చిన మాట ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.