Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. భారత్ సహా పలు దేశాలపై టారిఫ్‌లు ప్రకటించారు. తాజాగా మరో బాంబు పేల్చారు అధ్యక్షుడు. త్వరలోనే ఔషధ ఉత్పత్తులపై సుంకాల మోత మోగించనున్నట్లు ప్రకటించారు. అమెరికాకు దిగుమతయ్యే ఔషధ ఉత్పత్తులపై (pharma sector) భారీ ఎత్తున టారిఫ్‌లు విధించనున్నట్లు తెలిపారు.
మంగళవారం రాత్రి నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అమెరికాలో ఫార్మా ఉత్పత్తులు తయారు కావడం లేదన్నారు. అందుకే ఇతర దేశాల నుంచి వచ్చే ఔషధ ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఈ చర్యతో చైనా సహా వివిధ దేశాల్లోని ఫార్మా కంపెనీలన్నీ అమెరికాకు తరలివస్తాయని, ఇక్కడ తమ ప్లాంట్లను తెరుస్తాయని వ్యాఖ్యానించారు. కాగా, ఏప్రిల్ 2న భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వీటిలో ఔషధ ఉత్పత్తులకు తాత్కాలికంగా మినహాయింపు లభించింది. ఇప్పుడు వాటిపై కూడా త్వరలోనే సుంకాలు విధించనున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు.
ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. భారత ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉంది. అమెరికా ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన ఔషధాలు అందడంలో భారతీయ ఫార్మా కంపెనీలది కీలకపాత్ర. భారత్ అమెరికాకు చేసే ఔషధ ఎగుమతులు ఎక్కువగా జనరిక్ మందులే ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికాకు భారత్ నుంచి 9 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. భారత్ చేసుకుంటున్న దిగుమతులతో పోల్చితే ఇది 10 రెట్లు అధికం.
అమెరికాలో లభించే జనరిక్ ఔషధాల్లో దాదాపు 70 శాతం దిగుమతి అయినవే. ఇందులో సుమారు 50 శాతం భారత్ నుంచి వచ్చినవే. సిప్లా, లుపిన్, సన్ ఫార్మా వంటి సంస్థలతో పోల్చితే జనరిక్ ఔషధాలను భారీగా ఉత్పత్తి చేస్తున్న జైడస్, అరబిందో, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలపైనే అమెరికా టారిఫ్ పెంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీలు.. అమెరికా మార్కెట్ నుంచి ఐరోపా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల వైపునకు వెళ్లడమే ఉత్తమమని ఔషధ రంగ నిపుణులు భావిస్తున్నారు.
Also Read..
Panama Canal | పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటాం : పెంటగాన్
Tariffs | సుంకాల పేరుతో అమెరికా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది.. 104 టారిఫ్‌లపై చైనా స్పందన
US-China Tariff War | ట్రంప్ అన్నంత పని చేశాడుగా..! చైనాపై 104 శాతం ప్రతీకార సుంకాలు..!