Panama Canal | డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన నాటి నుంచి అనేక అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నారు. వలసదారులు, సుంకాలు, ఫెడర్ ఉద్యోగుల తొలగింపు వంటి వివాదాస్పద నిర్ణయాలతో అందరికీ దడపుట్టిస్తున్నారు. ఇక ప్రపంచ ఆధునిక ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పనామా కాలువ (Panama Canal) విషయంలోనూ ట్రంప్ తన వైఖరిని ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. 1914లో అమెరికా నిర్మించిన ఈ కెనాల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నిర్ణయంలో తన వైఖరిపై అమెరికా మరోసారి స్పష్టతనిచ్చింది. పనామా కాలువ (Panama Canal)ను కచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని పెంటగాన్ తాజాగా స్పష్టం చేసింది.
మధ్య అమెరికా సందర్శనకు వెళ్లిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth).. పనామా అధ్యక్షుడు (Panama President) జోస్ రౌల్ ములినోతో రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అతి ముఖ్యమైన జలమార్గాల్లో ఒకటైన పనామా కాలువను అమెరికా తిరిగి స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా – పనామా కలిసి పనామా కాలువపై చైనా ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పనామా నాయకత్వంలో కెనాల్‌ను సురక్షితంగా.. అన్ని దేశాలకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. పనామా బలగాలకు అమెరికా సైనిక భద్రతా సహకారాన్ని పెంచుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
1914లో అమెరికా ఈ కెనాల్‌ను నిర్మించింది. బార్బడాస్, జమైకాతోపాటు ఇతర కరీబియన్ దేశాల నుంచి వచ్చిన వేలాదిమంది ఆఫ్రికన్ కార్మికుల స్వేదంతో నిర్మించిన ఈ కెనాల్‌ను 1999లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పనామాకు అప్పగించారు. 1977లో చేసుకున్న ఒప్పందం మేరకు పనామా కెనాల్‌పై నియంత్రణను పనామాకు 1999లో అమెరికా అప్పగించింది. అయితే జలమార్గం తటస్థంగా ఉండాలని ఇరుదేశాల మధ్య అవగాహన కుదిరింది. అయితే కెనాల్ నిర్వహణ కార్యకలాపాలకు అంతర్గత ఘర్షణల వల్ల కానీ, విదేశీ శక్తుల వల్ల కాని ఆటంకం ఏర్పడిన పక్షంలో అమెరికా సైనికపరంగా జోక్యం చేసుకోవచ్చని ఒప్పందంలో ఉంది. అమెరికా నియంత్రణలో ఉన్న రోజుల కంటే ఇప్పుడు భారీ మొత్తంలో సరకు రవాణా ఈ కెనాల్ మీదుగా సాగుతున్నది.
ఈ మార్గం గుండా ఏటా 14 వేల షిప్‌లు వెళ్తూ ప్రపంచ వాణిజ్య వికాసాన్ని కొత్త పుంతలు తొక్కించింది. ప్రధానంగా అమెరికా, చైనా, చిలీ, జపాన్, దక్షిణ కొరియా దేశాలు పనామా కాల్వను గణనీయంగా ఉపయోగించుకుంటున్నాయి. ఇక పనామా కాల్వ నిర్మాణం కూడా ఓ ఘన చరిత్రే అని చెప్పాలి. 33 ఏండ్ల కల పనామా కాల్వ నిర్మాణం. దీని నిర్మాణంలో 27,600 శ్రామికులు మృత్యువాత పడ్డారు. 200 క్యూబిక్ మెట్రిక్ టన్నుల మట్టిని ఎత్తిపోశారు. విష కీటకాలు, మలేరియా బారినపడి వేలాది శ్రామికులు ఆ మట్టిలోనే కలసిపోయారు. ఇంతటి ఘన చరిత్రను సొంతం చేసుకున్న పనామా కాల్వను డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తీసుకుంటానని ప్రకటిస్తూ వస్తున్నారు.
Also Read..
“Donald Trump | ట్రంప్ హెచ్చరికల పర్వం.. పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం”
“Donald Trump | పక్క దేశాలపై ట్రంప్ కన్ను.. సైనిక చర్యకు దిగుతారా?”
“Donald Trump | త్వరలో శక్తివంతమైన చర్య.. పనామా కెనాల్‌ను స్వాధీనం చేసుకుంటాం: డొనాల్డ్ ట్రంప్”
“Donald Trump | గాజాను స్వాధీనం చేసుకుంటం.. ట్రంప్ సంచలన ప్రకటన”