Donald Trump | వాషింగ్టన్, ఫిబ్రవరి 5: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. తన ప్రకటనలు, దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్, పనామా కెనాల్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. తాజాగా గాజా స్ట్రిప్‌ను సైతం స్వాధీనం చేసుకుంటామంటూ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.
ప్రస్తుతం గాజా స్ట్రిప్‌లో ఉంటున్న పాలస్తీనియన్లు యుద్ధ ప్రాంతాన్ని వదిలి పెట్టి మధ్య ప్రాచ్య దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్లకు వెళ్లాలని ప్రతిపాదించారు. అయితే దానిని ఆ రెండు దేశాలూ తిరస్కరించాయి. ‘గాజా స్ట్రిప్‌ను మేము స్వాధీనం చేసుకుంటాం. దానిని పునర్ నిర్మిస్తాం. దానిని సొంతం చేసుకుంటాం’ అని ఆయన నెతన్యాహూతో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో తెలిపారు. ‘అక్కడ ఉన్న పేలని బాంబులను వెలికి తీయాలి. స్థలాన్ని చదును చేయాలి. కూలిన భవన శిథిలాలను తొలగించాలి. ఆర్థికంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అపరిమితంగా ఉద్యోగాలు ఇవ్వాలి, ఇళ్లను నిర్మించాలి’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇవన్నీ అక్కడికి తిరిగివచ్చే పాలస్తీనియన్లకు కాదని ట్రంప్ సంకేతమిచ్చారు. గాజావాసులు 20 లక్షల మంది పెద్ద మనసుతో వేరు దేశాలకు తరలి వెళ్లాలని ఆయన కోరారు. కాగా, ట్రంప్ ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధాని స్వాగతించారు. ట్రంప్ ప్రణాళిక చరిత్రనే మార్చేస్తుందని ఆయన ప్రశంసించారు.
తిరస్కరించిన ఈజిప్ట్, జోర్డాన్
ట్రంప్ ప్రతిపాదనను ఈజిప్ట్, జోర్డాన్లు తిరస్కరించాయి. ఐరాసలోని పాలస్తీనియన్ ప్రతినిధి మాట్లాడుతూ పాలస్తీనా ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రపంచ దేశ నేతలు గౌరవించాలని కోరారు. ట్రంప్ ప్రతిపాదనను గాజా పౌరులు సైతం తీవ్రంగా తిరస్కరించారు. గాజా ఏమన్నా చెత్తకుప్ప అని ట్రంప్ భావిస్తున్నారేమో, ఎంతమాత్రం కాదు అని రఫాకు చెందిన 34 ఏండ్ల హతెమ్ అజ్జాం ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాస్ సైతం ట్రంప్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిని ఎంతమాత్రం ఆమోదించమని స్పష్టం చేసింది.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మిత్ర దేశాలు
ట్రంప్ ప్రతిపాదనను మిత్రదేశాలు, విరోధులు నిర్దంద్వంగా తిరస్కరించారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగానే ఉండనివ్వాలని సౌదీ అరేబియా లాంటి దేశాలు కోరాయి. ట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలను పాలస్తీనా ఇస్లామిక్ జీహాద్ గ్రూప్ తీవ్రంగా నిరసించింది. గాజాపై అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేసింది. ‘గాజాపై బాంబులేసి పట్టు సాధించాలనుకున్న ఇజ్రాయెల్ ప్రణాళిక విఫలమైంది. ఇప్పుడు ఇక్కడి వారిని తరలించి గాజాను ఏదో చేస్తామంటున్న ట్రంప్ ప్రతిపాదన కూడా ఎంతమాత్రం విజయవంతం అవ్వదు ’ అని ఆ సంస్థ పేర్కొంది. పాలస్తీనా ప్రజలను బయటకు పంపే ఏ ప్రయత్నాన్ని అయినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించింది. పాలస్తీనా ప్రజలను బయటకు పంపకుండా గాజాను పునర్నిర్మించాలని ఈజిప్ట్ ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి బుధవారం కోరారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో సమగ్ర ప్రణాళిక ఏర్పాటు చేసి స్థానికులను కదల్చకుండా గాజాను పునర్ నిర్మించాలని పాలస్తీనా ప్రధాని మహమ్మద్ ముస్తఫా విజ్ఞప్తి చేశారు.
గత చరిత్ర మరిచారా?
గాజాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్ర ఆమోదయోగ్యం కాదని తుర్కియే విదేశాంగ శాఖ మంత్రి హకన్ ఫిడన్ అభ్యంతరం తెలిపారు. గతంలో పాలస్తీనా వాసులను వారి సొంత భూముల్లోంచి వెళ్లగొట్టి, ఆ ప్రాంతాలను ఇజ్రాయెల్ వాసులతో నింపేయాలనుకోవడం వల్లే ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభానికి బీజం పడిన విషయాన్ని గుర్తు చేశారు. ‘గాజా వాసులను అక్కడి నుంచి దేశ బహిష్కారం చేయాలనుకోవడం తప్పుడు, అర్థం లేని నిర్ణయం. దీనిని ఎంతమాత్రం సహించం’ అని ఆయన స్పష్టం చేశారు. గాజా ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించాలనుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చైనా ప్రకటించింది.
సాహసోపేత నిర్ణయం
ట్రంప్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ప్రశంసించారు. ఈ చర్యతో ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత ఏర్పడుతుందని అన్నారు. హమాస్ నుంచి గాజాకు విముక్తి కలగించాల్సిందేనని యూఎస్ స్టేట్ సెక్రటరీ మార్కో రుబియా అన్నారు.
విదేశీ విరాళాలపై గ్రీన్లాండ్ నిషేధం
ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో చర్యలు విదేశాల నుంచి రాజకీయ విరాళాలు తీసుకోవటంపై నిషేధం విధిస్తూ గ్రీన్లాండ్ పార్లమెంట్ మంగళవారం ఓ బిల్లును ఆమోదించింది. గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. డెన్మార్క్ ప్రధానిపై బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్ తాజా బిల్లును తీసుకొచ్చింది. ‘గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని, దీనిపై నియంత్రణ సాధించాలని శక్తివంతమైన మిత్ర రాజ్యాల ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రీన్లాండ్ భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన బిల్లు ఇది’ అని గ్రీన్లాండ్ పేర్కొన్నది.
1948 చరిత్ర పునరావృతం?
ఎప్పుడో 77 ఏండ్ల క్రితం ఎదురైన అనుభవాన్ని పాలస్తీనియన్లు ఇప్పుడు గాజా స్ట్రిప్‌లో తిరిగి ఎదుర్కొనే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ సందర్భంగా 1948లో నక్బా నుంచి తమను వెళ్లగొట్టిన ఉదంతాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 1948లో పాలస్తీనియన్లు తమ బహిష్కరణను నక్బా అని పిలుస్తారు. అరబ్-ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు, ఇజ్రాయెల్ స్థాపన తర్వాత జనాభాలో సుమారు ఏడు లక్షల మంది పాలస్తీనియన్లు ఇళ్లనుంచి పారిపోగా, మిగిలిన వారిని నిర్దాక్షిణ్యంగా తరిమేశారు. అయితే యుద్ధం తరువాత ఇజ్రాయెల్ వారిని తిరిగి రావడానికి అనుమతించ లేదు. ఎందుకంటే దాని సరిహద్దుల్లో పాలస్తీనా ఆధిక్యం ఉండేది. ఆ చర్యతో దాదాపు 60 లక్షల మంది శరణార్ధులుగా మారారు. వీరిలో ఎక్కువమంది లెబనాన్, సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్ ఆక్రమిత్ వెస్ట్ బ్యాంక్‌లోని మురికివాడల లాంటి శరణార్థి శిబిరాలలో నివసిస్తున్నారు.
దురహంకారానికి చిహ్నం
గాజా ఆక్రమణ ప్రకటన అమెరికా దురహంకారానికి చిహ్నంగా ఉందని యెమెన్ హౌతీ రెబల్స్ నేత మహ్మద్ అల్-బుఖారి విమర్శించారు. ఈ విషయంలో అమెరికా చర్యలను ఈజిప్ట్, జోర్డాన్ కనుక సవాల్ చేస్తే తాము వారి పక్షాన ఉంటామని ఆయన ప్రకటించారు.