Donald Trump | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: పనామా కెనాల్‌పై చైనా ప్రభావం, నియంత్రణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ‘ఒక శక్తివంతమైన చర్య’ ఉంటుందని ఆదివారం ట్రంప్ ప్రకటించారు. పనామా కెనాల్‌పై చైనా ప్రభావం పెరుగుతున్నదని, అమెరికా, పనామా మధ్య కుదిరిన ఒప్పందాన్ని పనామా ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఆరోపించారు. పనామా కెనాల్ నిర్వహణను అమెరికా ప్రభుత్వం వాపసు చేసుకుంటుందని ఆయన హెచ్చరించారు. పనామాకు అత్యంత కీలకమైన కెనాల్‌ను మూర్ఖంగా ఇచ్చివేశారని ఆయన అమెరికా గత పాలకులను విమర్శించారు. కెనాల్‌ను అమెరికాకు తిరిగి అప్పగించని పక్షంలో ‘శక్తివంతమైన చర్య’ జరుగుతుందని ట్రంప్ వెల్లడించారు. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే కీలకమైన పనామా జలమార్గాన్ని చైనాకు ఇవ్వలేదని, అమెరికా, పనామా మధ్య జరిగిన ఒప్పందం ఉల్లంఘన జరిగిందని ట్రంప్ అన్నారు.
పనామా కెనాల్‌ను ఆధునిక ప్రపంచ వింతగా ఆయన అభివర్ణించారు. అమెరికా నిర్మించిన ఈ కెనాల్ 1914లో ప్రారంభమైందని, బార్బడాస్, జమైకాతోపాటు ఇతర కరీబియన్ దేశాల నుంచి వచ్చిన వేలాదిమంది ఆఫ్రికన్ కార్మికుల స్వేదంతో నిర్మించిన ఈ కెనాల్‌ను 1999లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పనామాకు అప్పగించారని ట్రంప్ చెప్పారు. పనామా కెనాల్‌ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక బలగాలు అవసరమని తాను భావించడం లేదని ట్రంప్ చెప్పారు. పనామా ప్రభుత్వం తప్పు చేసిందని, ఒప్పందాన్ని ఉల్లంఘించిదని ట్రంప్ చెప్పారు. పనామా కెనాల్‌ను చైనా నిర్వహిస్తోందని, దాన్ని చైనాకు తాము ఇవ్వలేదని, పనామాకు మాత్రమే ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.
1977లో చేసుకున్న ఒప్పందం మేరకు పనామా కెనాల్‌పై నియంత్రణను పనామాకు 1999లో అమెరికా అప్పగించింది. అయితే జలమార్గం తటస్థంగా ఉండాలని ఇరుదేశాల మధ్య అవగాహన కుదిరింది. అయితే కెనాల్ నిర్వహణ కార్యకలాపాలకు అంతర్గత ఘర్షణల వల్ల కానీ, విదేశీ శక్తుల వల్ల కాని ఆటంకం ఏర్పడిన పక్షంలో అమెరికా సైనికపరంగా జోక్యం చేసుకోవచ్చని ఒప్పందంలో ఉంది. అమెరికా నియంత్రణలో ఉన్న రోజుల కంటే ఇప్పుడు భారీ మొత్తంలో సరకు రవాణా ఈ కెనాల్ మీదుగా సాగుతున్నది.
ఇదిలా ఉండగా, పనామా కెనాల్‌ను తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంటామని ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలతో పనామా దిగొచ్చింది. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టు సంబంధించి 2017లో కుదిరిన ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని పనామా అధ్యక్షుడు జోస్ ఆల్ ములినో ఆదివారం ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి రుబియోతో జరిగిన సమావేశంలో ములినో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పనామా కెనాల్‌పై చైనా నియంత్రణను తగ్గిస్తారా లేక అమెరికా నుంచి ప్రతీకార చర్యలను ఎదుర్కొంటారా అంటూ రుబియో చేసిన హెచ్చరికతో ములినో తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన పనామా కెనాల్ జలమార్గం నిర్వహణ బాధ్యతలను తామే తిరిగి చేపతామంటూ అమెరికాలోని కొత్త ప్రభుత్వం తీసుకువస్తున్న ఒత్తిడిని ములినో ప్రతిఘటించారు. రుబియోతో సమావేశమైన అనంతరం ములినో విలేకరులతో మాట్లాడుతూ కెనాల్‌ను తిరిగి చేపట్టడం లేదా బలాన్ని ఉపయోగించడం వంటి బెదిరింపులేవీ ఈ సమావేశంలో రాలేదని చెప్పారు. పనామా కెనాల్లో చైనా ప్రమేయంపై అమెరికా వ్యక్తం చేసిన అనుమానాలను తాను నివృత్తి చేసినట్టు ములినో చెప్పారు.
చైనాతో తమకున్న బీఆర్ఐ ఒప్పందం త్వరలోనే ముగియనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇది అమెరికా హెచ్చరికల ప్రభావంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రుబియో తొలి విదేశీ పర్యటనను ప్రస్తావిస్తూ ఈ పర్యటన తమ రెండు దేశాల మధ్య కొత్త సంబంధాలను నిర్మిస్తుందని, పనామాలో అమెరికా పెట్టుబడుల పెంపుదలకు తోడ్పడుతుందని ములినో ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ వరుస హెచ్చరికల నేపథ్యంలో పనామా సార్వభౌమత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని ములినో స్పష్టం చేశారు.