Donald Trump | వాషింగ్టన్, జనవరి 8: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల భూభాగాలపై కన్నేశారు. కెనడా, గ్రీన్లాండ్, పనామా కెనాల్ తమకేనంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. అప్పటినుంచి కెనడాను అమెరికాకు 51వ రాష్ట్రంగా, ట్రూడోను గవర్నర్‌గా ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. కెనడాను అమెరికాలో కలుపుకునేందుకు సైనిక చర్యకు దిగుతారా అని ప్రశ్నించగా.. ‘సైనిక చర్య ఉండదు. ఆర్థిక శక్తిని ప్రయోగిస్తాం. ఇరుదేశాల మధ్య కృత్రిమంగా గీసిన సరిహద్దు రేఖను వదిలించుకోవాలి. జాతీయ భద్రతకు ఇది చాలా మంచిది. మేము కెనడాను రక్షిస్తున్నాం. ఇందుకు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాం. పైగా ఇరు దేశాల వాణిజ్యంలో ఏటా 200 బిలియన్ డాలర్లు నష్టపోతున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను జస్టిన్ ట్రూడోతో పాటు ప్రతిపక్ష నేతలు ఖండించారు. అమెరికాలో కెనడా ఎప్పటికీ భాగం కాబోదని, తమది గొప్ప స్వతంత్ర దేశమని స్పష్టం చేశారు. ట్రూడో ప్రకటనపై ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ మండిపడ్డారు. ‘బాలికా, ఇక నువ్వు కెనడా గవర్నర్వు కాదు. కాబట్టి నువ్వు ఏం చెప్పావనేది విషయం కాదు’ అంటూ ట్రూడోను ఉద్దేశించి ‘ఎక్స్’లో మస్క్ వ్యాఖ్యానించారు.
అట్లాంటిక్ – పసిఫిక్ సముద్రాల మధ్య రవాణాకు కీలకమైన పనామా కెనాల్పైనా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పనామా కెనాల్‌ను సైనిక అవసరాల కోసం నిర్మించారు. ఇది అమెరికాకు చాలా కీలకం. ఈ కెనాల్‌ను అమెరికా పనామాకు ఇచ్చింది. కానీ చైనా ఈ కెనాల్ నిర్వహణను తీసేసుకుంది. అమెరికా నౌకలకు పనామా చాలా ఎక్కువ చార్జీలు వేస్తున్నది. కెనాల్ అప్పగింత ఒప్పందాన్ని పనామా ఉల్లంఘించింది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారీగా సహజ వనరులతో, వ్యూహాత్మకంగా కీలకమైన మంచు ప్రదేశం గ్రీన్లాండ్పైనా ట్రంప్ కన్నుపడింది. తమ దేశ భద్రతా అవసరాల దృష్ట్యా గ్రీన్లాండ్ తమకు కావాలని ట్రంప్ అన్నారు. గ్రీన్‌లాండ్‌పై డెన్మార్క్‌కు న్యాయమైన హక్కు ఉందా లేదా అనేదీ ఎవరికీ తెలియదని, స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ తమకు వదిలేయాలని ట్రంప్ పేర్కొన్నారు. గ్రీన్లాండ్లో చైనా, రష్యా నౌకలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కాగా, పనామా కెనాల్, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్యకు దిగుతారా అని ప్రశ్నించగా దిగబోమని చెప్పేందుకు ట్రంప్ నిరాకరించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని అనుకుంటున్నట్టు సైతం ట్రంప్ ప్రకటించారు.
యూరోపియన్ యూనియన్‌లో భాగమైన డెన్మార్క్‌లోని గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఫ్రాన్స్ తీవ్రంగా స్పందించింది. ‘యూరోపియన్ యూనియన్ సార్వభౌమ సరిహద్దులపై దాడి చేసేందుకు, జోక్యం చేసుకునేందుకు ప్రపంచంలో ఏ దేశాన్నీ అనుమతించే ప్రసక్తే లేదు’ అని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి జెయన్ నోయల్ బారట్ బుధవారం పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆక్రమిస్తుందని అనుకోవడం లేదని, ఇప్పుడు మనం బలంగా సమాధానం ఇచ్చే యుగంలో ఉన్నామని ఆయన పరోక్షంగా ట్రంప్‌ను హెచ్చరించారు.