France violence : ఫ్రాన్స్‌లో నిర్వహించిన ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ పోటీల్లో పారిస్ సెయింట్-జర్మైన్ (PSG) ఫుట్‌బాల్ క్లబ్ జట్టు.. ఇంటర్ మిలన్ జట్టుపై విజయం సాధించింది. దాంతో వేలమంది ఆ జట్టు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. ఈ సంబురాలు ప్రత్యర్థి జట్టు అభిమానులతో ఘర్షణకు దారి తీశాయి. ఇరుజట్ల అభిమానుల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. 192 మంది గాయపడ్డారు.
పారిస్ వీధుల్లో జరిగిన ఈ వేడుకలు హింసాత్మకంగా మారడంతో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించాయి. ఈ సందర్భంగా నిరసకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. బస్ షెల్టర్లను ధ్వంసం చేశారు. వేల మంది స్టోర్లు, దుకాణాల్లో చొరబడి అందులోని వస్తువులను దోచుకున్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన భద్రతా బలగాలపై దాడులు చేశారు.
ఫుట్‌బాల్ జట్ల అభిమానుల్లో అసాంఘిక శక్తులు కలిసిపోయి ఈ దారుణాలకు పాల్పడ్డాయని అధికారులు తెలిపారు. ఘర్షణలకు కారణమైన వారిలో 559 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హింసపై దర్యాప్తు చేపట్టారు.