Visas for Gazans : ఇజ్రాయెల్ (Israel) సైన్యానికి-హమాస్ (Hamas) రెబల్స్‌కు మధ్య యుద్ధంవల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గాజా ప్రజల (Gaza citizens) కు అమెరికా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై గాజా ప్రజలకు వీసాలు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన అనేక మంది గాజా ప్రజలు చికిత్స కోసం యూఎస్‌కు వస్తున్నారని ట్రంప్ యంత్రాంగానికి ఫిర్యాదు అందడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
టెంపరరీ మెడికల్ హ్యుమానిటేరియన్ వీసాల (Temporary medical-humanitarian visas) ను జారీ చేయడానికి ఉపయోగించే ప్రక్రియపై సమీక్ష నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా గాజా ప్రజలకు అన్ని రకాల వీసాలను నిలిపివేస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. గాజా నుంచి అమెరికాకు వచ్చే పాలస్తీనియన్లు హమాస్‌కు అనుకూలంగా ఉన్నారని, హమాస్‌కు నిధులు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందడంతో ఈ చర్యలు తీసుకున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.
వారం క్రితం తీవ్రంగా గాయపడిన 11 మంది పాలస్తీనియన్ చిన్నారులు వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లడానికి ఆ దేశానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘హీల్ పాలస్తీనా’ సహకరించిందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈవిధంగా పెద్ద మొత్తంలో ప్రజలను తరలించడం సరైన చర్య కాదని పేర్కొంది. ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంపై పలు స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
యూఎస్-ఆధారిత స్వచ్ఛంద సంస్థ ‘పాలస్తీనా చిల్డ్రన్స్ రిలీఫ్ ఫండ్’ ఈ విషయంపై స్పందిస్తూ.. అమెరికా తీసుకున్న ఈ ప్రమాదకరమైన అమానవీయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. గత 30 ఏళ్లుగా తాము వేలమంది పాలస్తీనా చిన్నారులను వైద్యం కోసం అమెరికాకు తరలించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు, ఆహార కొరతవల్ల వేలాదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతుంటే ఇలాంటి ఆంక్షలు ఎలా విధిస్తారని ప్రశ్నించింది.