Papaya | మహిళలకు గర్భధారణ సమయంలో అన్ని పండ్లను తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. కానీ బొప్పాయి పండును మాత్రం తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. బొప్పాయి పండు తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ బొప్పాయి పండు విషయంలో ముఖ్యంగా పచ్చి బొప్పాయి విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే నిజంగానే బొప్పాయి పండు గర్బిణీలకు హాని కలిగిస్తుందా.. దీనిని గర్భధారణ సమయంలో అస్సలు తీసుకోకూడదా.. దీని గురించి వైద్యులు ఏమంటున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండును తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. జీర్ణక్రియ మందగించడం, ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న గర్భిణీలు బొప్పాయి పండును కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల చక్కని ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. సమస్య పండులో కాదని బొప్పాయి పండు ఎంత వరకు పండింది, దానిని ఎంత మోతాదులో తీసుకుంటున్నాం, అలాగే గర్భిణీల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. శరీరంలో ఉండే హానికారక మూలాలను తొలగించే కెరోటినాయిడ్లు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి.
గర్భధారణ సమయంలో స్త్రీలు ఎక్కువగా మలబద్దకం సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి వారు బొప్పాయి పండును తగిన మోతాదులో తీసుకోవడం వల్ల సమస్య నుండి చక్కని ఉపశమనం కలుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో వచ్చే మార్నింగ్ సిక్నెస్, హార్ట్‌బర్న్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా బొప్పాయి పండు మనకు సహాయపడుతుంది. ఈ పండును తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి. బొప్పాయి పండులో ఫోలేట్ ఉంటుంది. ఇది పిండం మెదడు, వెన్నునిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది.
గర్భిణీలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన మోతాదులో పండిన బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే గర్భస్రావం, ముందస్తు ప్రసవం, లాటెక్స్ అలెర్జీ వంటి సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడమే మంచిదని వారు చెబుతున్నారు. ఇక గర్భిణీలు బాగా పండిన బొప్పాయిని ఒక కప్పు మోతాదులో వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవచ్చు. పచ్చి బొప్పాయిని, దోరగా పండిన బొప్పాయిని మాత్రం గర్భిణీలు తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.