Iran Protests | న్యూఢిల్లీ, జనవరి 14: నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో గడచిన రెండు వారాల్లో 2,403 మంది పౌరులు మరణించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో నిరసనకారులను ఉరితీసినట్లు తేలితే చాలా కఠినమైన చర్యలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి ఇరాన్ నాయకత్వాన్ని హెచ్చరించారు. దీనికి ఇరాన్ నాయకత్వం ఘాటుగా స్పందించింది. ఇరాన్ పౌరుల ప్రధాన హంతకులుగా ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను ఇరాన్ భద్రతా విభాగం అధిపతి నిందించారు. నిరసనకారులను ఇరాన్ హతమారిస్తే చాలా కఠినమైన చర్యలను అమెరికా తీసుకుంటుందని ట్రంప్ మంగళవారం సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ హెచ్చరించారు. నిరసనకారులను ఉరితీస్తే చాలా తీవ్రమైన పరిణామాలను మీరు చూస్తారు అని ట్రంప్ తెలిపారు.
ప్రభుత్వ వ్యవస్థలను స్వాధీనం చేసుకోవాలంటూ ఇరాన్ పౌరులకు ట్రంప్ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే ఇరాన్ మాజీ పార్లమెంట్ స్పీకర్, ప్రస్తుతం ఇరాన్ సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా పనిచేస్తున్న అలీ లారీజానీ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ప్రజలను హతమార్చిన ప్రధాన హంతకుల పేర్లను ప్రకటిస్తున్నాం. 1-ట్రంప్, 2-నెతన్యాహు అని ఆయన తెలిపారు. వేలాది ఇరాన్ పౌరుల ప్రాణాలను బలిగొన్న అలజడికి అమెరికా, ఇజ్రాయెల్ ఆజ్యం పోస్తున్నాయని లారీజానీ ఆరోపించారు. కాగా, రాజకీయ అస్థిరతను, హింసను ట్రంప్ రెచ్చగొడుతున్నారని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ ఆరోపించారు. ఇది ఇరాన్ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు ముప్పుగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ పౌరులు, ముఖ్యంగా యువజనుల మరణాలకు అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని యూఎన్ భద్రతా మండలికి రాసిన లేఖలో ఇరావానీ ఆరోపించారు. మంగళవారం ట్రంప్ పెట్టిన సోషల్ మీడియా పోస్టుకు స్పందనగా యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌కు కూడా ఆయన లేఖ రాశారు.
అమెరికా స్థావరాలపై దాడిచేస్తాం!
తమపై అమెరికా దాడి చేస్తే, తాము పొరుగు దేశాల్లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఉన్నత స్థాయి నేత ఒకరు ఓ వార్తా సంస్థతో బుధవారం మాట్లాడుతూ, నిరసనకారుల తరపున జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలను నిలువరించాలని ఇరాన్ నిర్ణయించిందన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, తుర్కియేలోని అమెరికన్ స్థావరాలపై దాడి చేస్తామని ఆ దేశాలకు చెప్పినట్లు తెలిపారు.
ముగ్గురు దౌత్యవేత్తలు మాట్లాడుతూ.. ఖతార్‌లోని అమెరికా సైన్యానికి చెందిన అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్‌ను బుధవారం సాయంత్రానికి వదిలిపెట్టిపోవాలని కొందరు సిబ్బందికి సలహా ఇచ్చినట్లు చెప్పారు. ఇది ఆదేశాల ద్వారా ఖాళీ చేయించడం కాదని, కేవలం సర్దుబాటు చేసుకోవడమని తెలిపారు. దోహాలోని అమెరికన్ ఎంబసీ దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించలేదు. ఉగ్రవాదులు సృష్టిస్తున్న అశాంతిని అమెరికా, ఇజ్రాయెల్ ప్రేరేపిస్తున్నాయని ఇరాన్ నేతలు ఆరోపించారు. ఇరాన్‌పై అమెరికా దాడిని నిరోధించాలని ఈ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలను కోరినట్లు ఇరాన్ ఉన్నత స్థాయి నేత ఒకరు చెప్పారు. కాగా, ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియాలోని తమ బేస్‌ల నుంచి కొంత మంది బలగాలను అమెరికా ఉపసంహరించుకుంటున్ననట్టు సమాచారం.
ఇరాన్‌ను వీడండి
ఇరాన్లో భద్రత పరిస్థితులు క్షీణించడంతో ఆ దేశంలోని భారతీయులకు టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం మార్గదర్శకాలను జారీ చేసింది. అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనాల ద్వారా వెంటనే ఇరాన్ నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. భారత్‌కు చెందిన విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులు తమ ట్రావెల్, ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పింది. ఈ విషయంలో ఏదైనా సహాయం అవసరమైతే తమను సంప్రదించాలని తెలిపింది.
ఇరాన్లో 20 రోజుల నుంచి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీని జారీ చేసింది. భారత పౌరులు, భారత మూలాలు గల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నిరసనలు, ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఎంబసీని సంప్రదిస్తూ ఉండాలని, స్థానిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవాలని చెప్పింది.
ఇరాన్ సహా 75 దేశాలకు వీసాల నిలిపివేత
అగ్రరాజ్యం అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్, రష్యా సహా 75 దేశాలకు చెందిన ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులపై నిషేధాన్ని విధించింది. ఇమిగ్రేషన్ తనిఖీలను కఠినతరం చేసే విస్తృత ప్రయత్నంలో భాగంగా 75 దేశాల దరఖాస్తుదారులకు వలస వీసా ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది.
దేశంలోకి ప్రవేశించిన తర్వాత ప్రభుత్వ సహాయంపై ఆధారపడే అవకాశం ఉన్న వ్యక్తులకు వీసాలు మంజూరు చేయకుండా నిరోధించడమే ఈ చర్యల లక్ష్యం. ఈ నిషేధం ఈ నెల 21 నుంచి అమల్లోకి వస్తుంది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇలా నిషేధం విధించిన దేశాల్లో ఇరాన్, రష్యా, సోమాలియా, అఫ్ఘానిస్థాన్, బ్రెజిల్, ఈజిప్ట్, నైజీరియా, థాయ్‌లాండ్, యెమెన్ తదితర దేశాలున్నట్టు వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలిన్ లెవిట్ వెల్లడించారు.
నిరసనకారుడికి బహిరంగంగా ఉరి!
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న 26 ఏండ్ల యువకుడిని ఇరాన్ ప్రభుత్వం బుధవారం బహిరంగంగా ఉరితీయనుంది. ఎలాంటి విచారణ లేకుండా ఒక యువకుడిని ఇలా బహిరంగంగా ఉరి తీయడానికి ఇరాన్ ప్రభుత్వం సిద్ధపడటం పట్ల అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఇరాన్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలంటూ దేశ వ్యాప్తంగా గత వారం రోజులుగా పెద్దయెత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో ఆందోళనలో పాల్గొన్న ఎర్ఫాన్ సోల్టానీ (26) అనే ఇరాన్ దేశస్థుడిని భద్రతా బలగాలు ఈ నెల 8న అరెస్ట్ చేశాయి. అతడి అరెస్ట్ గురించి కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు. అతని ఆచూకీ కోసం వారు గాలిస్తుండగా హఠాత్తుగా ఈ నెల 14న అతడిని బహిరంగంగా ఉరితీస్తున్నట్టు అధికారులు వారికి చెప్పారు. కడసారి చూపుల కోసం 10 నిమిషాల టైం ఇస్తున్నట్టు తెలిపారు. దీనిపై నోరెత్తితే వారిని కూడా అరెస్ట్ చేస్తామని బెదిరించారు. దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగిన క్రమంలో ఇలా ఆందోళనకారుడు ఒకరిని బహిరంగంగా ఉరి తీయడం ఇదే మొదటిసారి.
ఎన్ఐఏ చీఫ్‌గా రాకేశ్ అగర్వాల్
మస్కట్ చేరుకున్న ఐఎన్ఎస్వీ ‘కౌండిన్య’