నర్సంపేట, మార్చి 15: వరంగల్ జిల్లా నర్సంపేటలో అనుమానాస్పద స్థితిలో యువ వైద్యుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన డాక్టర్ జొన్నడ శశిధర్‌రెడ్డి(35)-డాక్టర్ సింధూరరెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. శశిధర్‌రెడ్డి వరంగల్ కేఎంసీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సింధూరరెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా పని చేస్తున్నారు. వీరు పదేళ్ల నుంచి నర్సంపేటలో శశి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు.
శనివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు వెళ్లి అక్కడే విందు భోజనాలు ముగించుకొని సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చారు. నిద్ర పట్టడం లేదని, ఆస్పత్రిలోనే పడుకుంటానని భార్యకు చెప్పి అదేరోజు రాత్రి వెళ్లాడు. ఆదివారం ఉదయం 8 గంటలైనా తిరిగి రాకపోవడంతో డాక్టర్ సింధూరరెడ్డి వెళ్లి చూడగా బెడ్‌పై శశిధర్‌రెడ్డి విగతజీవిగా కనిపించాడు. వెంటనే తోటి వైద్యుల సలహా మేరకు పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి స్వస్థలం హైదరాబాద్.
ఆయన తమ్ముడు అమెరికాలో ఉంటున్నట్లు సన్నిహితులు తెలిపారు. వైద్యుడి మృతిపై అతడి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే, డాక్టర్ శశిధర్‌రెడ్డి మృతికి నర్సంపేట ఐఎంఏ వైద్యులు నివాళులర్పించారు.