హనుమకొండ, జూలై 30 : కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నిర్వహించి, 80 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సూచనల మేరకు ఢిల్లీకి వెళ్లిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం జంతర్ మంతర్ వద్ద శాంతియుత ధర్నా నిర్వహించారు.
ఈ పార్ల మెంట్ సమావేశాల్లోనే కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని, అలాగే సెంట్ర లైజ్డ్ క్రూ లాబీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్నారు. కాజీపేట నుంచి క్రూలింక్లను తరలించవద్దని, బోడ గుట్ట వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. చిరు వ్యాపారులకు వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయా లని, స్థానిక ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ ఇవ్వాలన్నారు. అలాగే వరంగల్లోని రైల్వే స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని, రైల్వే స్టేషన్ల ఎదుట ఉన్న ఆటో అడ్డాల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయవద్దని, ఫాతిమా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం కోసం రైల్వే శాఖ సహకరించాలని కోరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 ఏండ్లుగా తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని వారు విమర్శించారు. హకుల కోసం కొట్లాడాల్సిన ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రం నుంచి నిధులను తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణ హకుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నార్లగిరి రమేశ్, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, సంకు నర్సింగరావు, బొంగు అశోక్ యాదవ్, నాయకులు పులి రజినీకాంత్ ముదిరాజ్, పోలపెల్లి రామ్మూర్తి, అఫ్జల్, గబ్బెట శీను, నరసింహా రావు, దువ్వ కనకరాజు, కొండ రాజు, పులి విక్రమ్, బరిగెల వినయ్, పున్నం చందర్, తండమళ్ల వేణు, చుంచు అశోక్, నరేశ్, సాధినేని సుధాకర్, దశరథం, రాబర్ట్, వంశీ, గణేశ్, చందు, హుస్సేన్, పుల్లయ్య పాల్గొన్నారు.