Donald Trump | అణ్వాయుధాల (nuclear weapons) విషయంలో ఇరాన్ (Iran)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ అణ్వాయుధాలను మర్చిపోవాలని తేల్చి చెప్పారు. ఒకవేళ తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి అణ్వాయుధాలను తయారుచేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధ తయారీ కేంద్రంపై సైనిక చర్యకూ వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
అణు ఒప్పందం విషయంలో టెహ్రాన్‌తో అమెరికా ఓవైపు చర్చలు జరుపుతుండగా.. ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాల మధ్య న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్ కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో ఇరాన్ తమను మోసం చేస్తున్నట్లు కన్పిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక, న్యూక్లియర్ డీల్‌పై ఇటీవల ఒమన్‌లో తొలివిడత చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. చర్చలు ముగిసిన తర్వాత ఇరాన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. అమెరికాతో అణ్వాయుధ ఒప్పందానికి సంబంధించి చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని పేర్కొంది. రెండో దశ చర్చలు వచ్చే శనివారం రోమ్ వేదికగా జరుగుతాయని తెలిపింది.
2018లో ఇరాన్ తో ఒప్పందం రద్దు
ట్రంప్ తన మొదటి 2017-21 పదవీకాలంలో ఇరాన్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగించారు. ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా 2018లో రద్దు చేశారు. అప్పటి నుంచి ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతన్నాయి. ఆ తర్వాత ఇరాన్‌పై ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఆ తర్వాత అనేక సంవత్సరాలుగా పరోక్ష చర్చలు ఫలించకపోవడంతో.. ఇటీవల ట్రంప్ మళ్లీ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. కానీ, ఈ విషయంలో ఇరాన్ వైఖరి యథాతథంగా కొనసాగుతుండటం ఉద్రిక్తతలకు తెరపడటం లేదు.
Also Read..
Sudan | సూడాన్‌లో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాల దాడులు.. 300 మంది పౌరులు మృతి
Neela Rajendra: ట్రంప్ ఆదేశాలు.. నాసా డీఈఐ చీఫ్ నీలా రాజేంద్ర తొలగింపు
Harvard University: హార్వర్డ్ యూనివర్సిటీకి 200 కోట్ల డాలర్ల నిధుల్ని నిలిపేసిన ట్రంప్ సర్కార్