న్యూయార్క్: అమెరికాలోని ట్రంప్ సర్కారు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University)కి సుమారు రెండు వందల కోట్ల డాలర్ల నిధుల్ని ఆపేసింది. ఆ మొత్తం నిధుల్ని సీజ్ చేసినట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. శ్వేతసౌధం విధించిన డిమాండ్లను యూనివర్సిటీ అంగీకరించలేదు. దీంతో ఆ వర్సిటీకి అందాల్సిన నిధుల్ని నిలిపివేశారు.
వారం క్రితం హార్వర్డ్ వర్సిటీకి కొన్ని డిమాండ్ల జాబితాను వైట్‌హౌజ్ పంపింది. క్యాంపస్‌లలో యూద వ్యతిరేక విధానాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని శ్వేత సౌధం కోరింది. దీనిలో భాగంగా వర్సిటీ పరిపాలనా మార్పులు చేయాలని సూచించింది. సిబ్బందిని అద్దె తీసుకునే విధానం, అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేయాలని వైట్‌హౌజ్ కోరింది.
కానీ ట్రంప్ సర్కారు చేసిన అభ్యర్థనను హార్వర్డ్ యూనివర్సిటీ తిరస్కరించింది. తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని హార్వర్డ్ వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. విధానాలను మార్చుకోవాలని ట్రంప్ సర్కారు చేసిన సూచనను వ్యతిరేకించిన తొలి వర్సిటీగా హార్వర్డ్ నిలిచింది.
యూద విద్యార్థులకు రక్షణ కల్పించడంలో ప్రఖ్యాత యూనివర్సిటీలన్నీ విఫలం అవుతున్నాయని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. గాజా యుద్ధం , ఇజ్రాయిల్‌కు మద్దతు ఇవ్వడం వంటి అంశాల నేపథ్యంలో అమెరికాలోని వర్సిటీల్లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం చేసిన డిమాండ్లకు తలొగ్గడం లేదని హార్వర్డ్ వర్సిటీ ప్రెసిడెంట్ అలన్ గార్బర్ ఓ లేఖలో తెలిపారు. డిమాండ్ల అంగీకరించకుంటే ఆర్థిక సాయం అందదని ప్రభుత్వం హెచ్చరించిందని ఆయన చెప్పారు.