Donald Trump | అమెరికా వస్తువులపై భారత్ (India) విధించే సుంకాల (tariffs) పై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తాజాగా స్పందించారు. గతంలో ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ భారత్ పన్నులు తగ్గించేందుకు అంగీకరించిందని.. అదంతా తన ఘనతే అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మాత్రం తమ వస్తువులపై విధించే వాణిజ్య సుంకాలను న్యూ ఢిల్లీ తగ్గిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
ఈ మేరకు బ్రెయిట్‌బార్ట్ న్యూస్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. ‘నాకు భారత్‌తో మంచి సంబంధం ఉంది. కానీ ఏకైక సమస్య ఏంటంటే.. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. భారత్ టారిఫ్‌లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉన్నట్లు నేను నమ్ముతున్నాను. కానీ, ఏప్రిల్ 2 నుంచి వారెంత విధిస్తే.. మేమూ అంతే వసూలు చేస్తాం’ అని ట్రంప్ అన్నారు.
అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదన్న భారత్
కాగా, అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు ఆ దేశానికి భారత్ ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్తాల్ పార్లమెంటరీ ప్యానెల్‌కు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘టారిఫ్‌లను తగ్గించడానికి భారత్ అంగీకరించింది’ అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయన పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇచ్చారు. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, ఆ దేశానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని, ఎలాంటి ఒప్పందం జరగలేదని ఆయన తెలిపారు.
ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై సుంకాలు..
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. వాణిజ్య యుద్ధానికి తెరలేపిన విషయం తెలిసిందే. భారత్ సహా కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తున్నారు. భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటించారు.
అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ట్రంప్ ప్రసంగించారు. కొన్ని దేశాలు దశాబ్దాల పాటూ అమెరికాపై టారిఫ్‌లు విధుస్తున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్ వంటి చాలా దేశాలు తమ నుంచి అధిక సుంకాలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇది చాలా అన్యాయమన్నారు. భారత్ తమపై 100 శాతం కంటే ఎక్కువ టారిఫ్‌లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ‘భారత్ మాపై 100 శాతం కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తోంది. మా ఉత్పత్తులపై చైనా సగటు సుంకం మనం వసూలు చేసే దానికంటే రెండింతలు ఎక్కువ. ఇక దక్షిణ కొరియా సగటు సుంకం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనకు సమయం వచ్చింది. ఏప్రిల్ 2 నుంచి ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయి. ఆయా దేశాలు మన ఉత్పత్తులపై ఎంత టారిఫ్‌లు విధిస్తే మనమూ తిరిగి అంతే వసూలు చేస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read..
RJ Mahvash | చాహల్, ధనశ్రీ విడాకుల వేళ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన మహ్వశ్
Donald Trump | జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్
RJ Mahvash | చాహల్, ధనశ్రీ విడాకుల వేళ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన మహ్వశ్