Modi-Trump | ఇజ్రాయెల్- హమాస్‌ల (Israel-Hamas) మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. గాజాలో యుద్ధం (Gaza Plan) ముగింపుకు ట్రంప్ (Donald Trump) సూచించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ అంగీకరించింది. గాజాపై ట్రంప్ ప్రణాళికను భారత్ (India) కూడా స్వాగతించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రీపోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
గాజాలో యుద్ధం ముగించేందుకు ట్రంప్ చేసిన ప్రణాళికను స్వాగతిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం తెలిపారు. ట్రంప్ ప్రణాళిక పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతికి మార్గమని పేర్కొన్నారు. యుద్ధం ముగించి శాంతిని నెలకొల్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండానే ట్రంప్ రీపోస్టు చేశారు. టారిఫ్‌ల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ మోదీ పోస్టును ట్రంప్ రీపోస్టు చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో చర్చలు జరిపిన అనంతరం గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించారు. చర్చల అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలస్తీనాలో దీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో రూపొందించిన 20 సూత్రాల ప్రణాళికను వారు విడుదల చేశారు. కాల్పుల విరమణ విధివిధానాలను స్థూలంగా వివరించిన ట్రంప్ గాజాలో యుద్ధాన్ని నిలిపివేసేందుకు, బందీల విడుదలకు, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు దీన్ని రూపొందించినట్లు చెప్పారు.
అంతేకాదు ఈ ప్రతిపాదనలకు హమాస్ అంగీకరించని పక్షంలో ఆ గ్రూపును పూర్తిగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా సంపూర్ణ సహకారం ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. గాజాలో శాంతి స్థాపనే ఈ ప్రణాళిక లక్ష్యమని నెతన్యాహు తెలిపారు. హమాస్ తన ఆయుధాలను పూర్తిగా వదిలిపెట్టాలని, గాజాలో శాంతియుత ప్రభుత్వం ఏర్పడాలని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. తమకు ఇంకా ముసాయిదా అందలేదని తెలిపిన హమాస్ ఆయుధాలు విడిచిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో కాల్పుల విరమణ, బందీలను 72 గంటల్లో హమాస్ విడుదల చేయడం, హమాస్ నిరాయుధీకరణ, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు దశలవారీగా ఉపసంహరణ, ట్రంప్ సారథ్యంలో గాజాలో ఆపద్ధర్మ ప్రభుత్వం వంటివి ఉన్నాయి. తన 20 సూత్రాల శాంతి ప్రతిపాదనపై స్పందించేందుకు హమాస్‌కు మూడు, నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉందని ట్రంప్ తెలిపారు. మిగిలిన అన్ని పక్షాలు ఒప్పందంపై సంతకాలు చేశాయని, హమాస్ సంతకం చేయకపోతే దాని కథ విషాదాంతం అవుతుందని హెచ్చరించారు.
Also Read..
US Shutdown: షట్‌డౌన్ ఉన్నా .. చట్టసభ ప్రతినిధులకు మాత్రం పేమెంట్ ఫుల్
US Shutdown: గతంలో ఎప్పుడెప్పుడు, ఎన్ని సార్లు అమెరికా షట్‌డౌన్ అయ్యిందో తెలుసా?
Earthquake | ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 69 మంది మృతి