న్యూఢిల్లీ: భారీ భూకంపం (Earthquake)తో ఫిలిప్పీన్స్ (Philippines) వణికిపోయింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం ధాటికి సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని అనేక ఇండ్లు, బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి. భూకంపం వల్ల ఇప్పటివరకు సుమారు 31 మంది మరణించారు. 147 మంది గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సెబు ప్రావిన్స్‌లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని తెలిపారు. బోగో నగరంలో అత్యధికంగా 19 మంది మృతిచెందగా, 119 మంది గాయపడ్డారు.
భూకంపం వల్ల కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, పలు చోట్ల రోడ్లు బీటలు వారాయి. పర్వత ప్రాంతాలలో ఉన్న గ్రామాలపై కొండచరియలు విరిగిపడటంతో అక్కడి చేరుకోవడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. శిథిలాలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని దవాఖానలకు తరలిస్తున్నారు. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసిన ఫిల్పిప్పీన్స్ జియోలాజికల్ విభాగం ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. ఇటీవల రాగస తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే ఫిలిప్పీన్స్ వాసులు కోలుకుంటుండగా భూకంపం రూపంలో మరోసారి ప్రకృతి వారిపై విరుచుకుపడింది.
కాగా, సెబూ ప్రావిన్స్ దీనిని రాష్ట్రీయ విపత్తుగా ప్రకటించింది. అదేవిధంగా భూకంప ప్రభావిత ప్రాంతాలైన బోగో, స్యాన్ రెమిగో, టెబ్యులాన్, మెడెల్లిన్ పట్టణాలు కూడా విపత్తుగా ప్రకటించాయి. భూకంప ధాటికి సెబూలోని దశాబ్దాల కాలంనాటి సెయింట్ పీటర్ చర్చ్ కూలిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
⚡️Powerful M6.9 Earthquake Rocks Philippines 🇵🇭 – Tremors Knockout Lights at Church on Bantayan Island pic.twitter.com/TtVxqJH0V3
— RT_India (@RT_India_news) September 30, 2025