హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ప్రధాన రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే గంధమల్ల రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యాన్ని కుదించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు 7వ లింక్‌లోని ప్యాకేజీ-22లో భాగమైన కొండంచెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని 3.80 టీఎంసీల నుంచి 0.8 టీఎంసీలకు కుదించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భూసేకరణ, పునరావాస (ఆర్అండ్ఆర్) పనులకు నిధులు వెచ్చించలేక ప్రభుత్వం ఏకంగా రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గిస్తున్నదని అధికార వర్గాలు చెప్తున్నాయి. దీని వల్ల 2 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు 7వ లింకులో 20, 21, 22 ప్యాకేజీలు ఉన్నాయి. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసి 20, 21 ప్యాకేజీల ద్వారా నిజామాబాద్‌కు, 22వ ప్యాకేజీ ద్వారా కామారెడ్డి జిల్లాలో ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది. అందుకోసం గతంలో పలు రిజర్వాయర్లను ప్రతిపాదించారు.
తద్వారా తొలుత ఎస్సారెస్పీ నుంచి జలాలను మసని చెరువుకు తరలిస్తారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప, కొండంచెరువులను కలిపి 3.50 టీఎంసీల సామర్థ్యం, 454 ఎఫ్‌ఆర్‌ఎల్‌తో రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించారు. దాని నుంచి భూంపల్లి రిజర్వాయర్‌కు 0.9 టీఎంసీలు, తిమ్మక్కపల్లికి 1.50 టీఎంసీలు, ధర్మరావుపేటకు 0.50 టీఎంసీలు, ముద్దోజిపేటటకు 0.50 టీఎంసీలు, కాటేవాడికి 0.5 0టీఎంసీలు, మోతె రిజర్వాయర్‌కు 2 టీఎంసీలు తరలించాలి. తద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉన్నది. ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్యాకేజీ-21(ఏ)గా విభజించారు.
ఈ రిజర్వాయర్ నిర్మాణంతో 9 అవాసాల్లో దాదాపు 650 ఇండ్లు ముంపునకు గురవుతాయని అధికారులు తేల్చారు. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకు కలిపి రూ.334 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు. కానీ, ఈ భూసేకరణ పూర్తికాకపోవడంలో రిజర్వాయర్ నిర్మాణం ముందుకు సాగలేదు. తాజాగా మంచిప్ప, కొండంచెరువులను కలుపకూడదని, కొండంచెరువు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యాన్ని కేవలం 0.8 టీఎంసీలకే పరిమితం అధికారులు ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. దీని వల్ల దిగువనున్న ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించడం కష్టమవుతుందని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు.