ఖైరతాబాద్, మార్చి 18 : రాష్ట్ర రాజధానిలో సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని బంజారా సంఘాల నేతలు సూచించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సేవాలాల్ సేన, లంబాడా హక్కుల పోరాట సమితి, సేవాలాల్ బంజారా సంఘం సంయుక్తాధ్వర్యంలో చర్చాగోష్టి నిర్వహించారు. సేవాలాల్ విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రభుత్వ దమననీతిని సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు భూక్య సంజీవ్‌నాయక్ ఖండించారు. సేవాలాల్ విగ్రహ స్థాపన అంశంలో కాంగ్రెస్ సర్కార్ రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. బంజారాహిల్స్‌కు చారిత్రక నేపథ్యం ఉన్నదని, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారాల ఆస్తిత్వాన్ని గుర్తించే అక్కడ బంజారా భవన్ నిర్మించారని వారు గుర్తుచేశారు.
సేవాలాల్ విగ్రహం రాజధానిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది గిరిజన బిడ్డలతో ఈ నెల 25న అసెంబ్లీని ముట్టడించి, పాలక ప్రభుత్వానికి తమ సత్తా ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంల పార్టీలను కూడా కలిసి మద్దతు కోరుతామని తెలిపారు. సమావేశంలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంబాల్ నాయక్, భరత్ చవాన్, ఓయూ నేత కే రాజు, సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బాలునాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు విష్ణునాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకురాలు రుక్మిణీబాయి, సక్రీబాయి, గణేశ్ నాయక్, అభి నాయక్, రవి నాయక్ పాల్గొన్నారు.