వాషింగ్టన్ : అమెరికా(US Shutdown) సర్కారు మూతపడినా.. చట్టసభ ప్రతినిధులకు మాత్రం పేమెంట్ ఆగదు. సేనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫండింగ్ బిల్లుకు ఆమోదం దక్కకపోవడంతో.. అమెరికా సర్కారు ఇవాళ షట్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలిక సెలవు ఇస్తారు. అలాంటి ఉద్యోగులకు జీతం ఉండదు. కానీ ఫండింగ్ బిల్లులను అడ్డుకునే చట్టసభ ప్రతినిధులకు మాత్రం షట్‌డౌన్ ప్రకటించినా.. పేమెంట్ మాత్రం ఇవ్వకుండా ఉండలేరు.
ఫెడరల్ ట్రెజరీ నుంచి కాకుండా, మరో నిధి నుంచి చట్టసభ ప్రతినిధులకు పేచెక్లు ఇస్తారు. చట్టసభ ప్రతినిధులకు అమెరికా రాజ్యాంగం ఆ రక్షణ కల్పిస్తున్నది. ఆర్టికల్ 1, సెక్షన్ 6 ప్రకారం .. సేనేటర్లు లేదా హౌజ్ రిప్రజెంటేటివ్‌లు చట్టం ప్రకారం పరిహారాన్ని అందుకుంటారని పేర్కొన్నది. షట్‌డౌన్ వేళ కొందరు చట్టసభ ప్రతినిధులకు జీతం ఇవ్వడాన్ని మరికొంత మంది ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు.
తాత్కాలిక సెలవుపై వెళ్లే వారి రోజు ఖర్చు సుమారు 400 మిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ ఆఫీసు డైరెక్టర్ ఫిలిప్ స్వాజెల్ తన లేఖలో దేశవ్యాప్తంగా సుమారు ఏడున్నర లక్షల ఫెడరల్ ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు 7.5 లక్షల మంది ఉద్యోగులకు తాత్కాలిక సెలవు ఇచ్చే అవకాశం ఉన్నది. అలాంటి ఉద్యోగులకు అయ్యే ఖర్చు 400 మిలియన్ల డాలర్లు అని అంచనా వేస్తున్నారు.
రోజువారీగా తాత్కాలిక సెలవులపై వెళ్లే ఉద్యోగుల సంఖ్య మారుతూ ఉంటుంది. ఒకవేళ మరీ ఎక్కువ కాలం షట్‌డౌన్ ఉంటే, అప్పుడు కొన్ని ప్రభుత్వ శాఖలు ఎక్కువ మంది ఉద్యోగులను ఫర్లాగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మిలిటరీ విషయానికి వస్తే, వాళ్లు షట్‌డౌన్ సమయంలో కూడా పని చేయాల్సి ఉంటుంది. షట్‌డౌన్ ముగిసిన తర్వాత సైన్యానికి పేమెంట్ ఇస్తారు. వ్యాపార కార్యకలాపాలపై షట్‌డౌన్ ప్రభావం భిన్నంగా ఉంటుంది. ఎన్ని రోజుల పాటు షట్‌డౌన్ ఉంటుందన్న అంశం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై వాణిజ్యం ఆధారపడి ఉంటుంది.