వాషింగ్టన్ డీసీ: అమెరికా సర్కారు ఇవాళ షట్‌డౌన్(US Shutdown) ప్రకటించింది. రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన నిధుల బిల్లుకు సేనేట్‌లో ఆమోదం దక్కలేదు. డెడ్‌లైన్ ముగిసిపోవడంతో వైట్‌హౌజ్ షట్‌డౌన్ ప్రకటించింది. అయితే ఇటీవల అమెరికాలో మూసివేతలు సర్వసాధారణమయ్యాయి. కేవలం డోనాల్డ్ ట్రంప్ పాలనలోనే ఇలాంటి షట్‌డౌన్ ఘటనలు చోటుచేసుకోవడం ఇది మూడవసారి. ఇక ట్రంప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఓ సారి అత్యధికంగా 35 రోజుల పాటు ప్రభుత్వాన్ని షట్‌డౌన్ చేశారు. 2018లో ఇది జరిగింది. అమెరికా చరిత్రలోనే ఇది అతి సుదీర్ఘ షట్‌డౌన్.
ట్రంప్ సర్కారు కన్నా ముందు బిల్ క్లింటన్ ప్రభుత్వం పేరిట షట్‌డౌన్ రికార్డు ఉన్నది. బిల్ క్లింటన్ దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1995లో ప్రభుత్వాన్ని 21 రోజుల పాటు మూసివేశారు. క్లింటన్ ఫస్ట్ టర్మ్‌లో హౌజ్‌తో పాటు సేనేట్‌లో కూడా రిపబ్లికన్లు ఆధిపత్యం ప్రదర్శించారు. భారీ బడ్జెట్‌ను పాస్ చేయాలని భావించారు. మెడికేర్ ఖర్చులను తగ్గిస్తూ ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సమయంలో క్లింటన్ సర్కారు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నది.
బరాక్ ఒబామా ప్రభుత్వం కూడా ఓసారి ఇలాంటి షట్‌డౌన్ పరిస్థితి ఎదుర్కొన్నది. 2013లో ఒబామా సర్కారు 16 రోజుల పాటు షట్‌డౌన్ ప్రకటించింది. ఒబామా ప్రవేశపెట్టిన ప్రతిపాదిత హెల్త్ కేర్ బిల్లును వ్యతిరేకించడంతో అప్పుడు షట్‌డౌన్ పరిస్థితి ఎదురైంది.
రోనాల్డ్ రీగన్ సర్కారు కూడా షట్‌డౌన్ ప్రకటించారు. ఆయన కూడా రిపబ్లికన్ అధ్యక్షుడు. ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో చాలా సార్లు అమెరికా షట్‌డౌన్ అయ్యింది. 1980 దశకంలో ఆయన రెండుసార్లు దేశాధ్యక్షుడయ్యారు. ఆ టైంలో 8 సార్లు ప్రభుత్వం షట్‌డౌన్ అయ్యింది. కానీ ఒకటి లేదా రెండు రోజుల తేడాతో మళ్లీ బిల్లులకు క్లియరెన్స్ దక్కేది.