Donald Trump | మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడి (US President)గా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. మరికొద్ది గంటల్లో అధ్యక్షుడి హోదాలో ట్రంప్ శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు ఎంత జీతం వస్తుంది..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి..? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. అగ్రరాజ్యాన్ని పాలించే అధిపతి జీతం ఏడాదికి 4 లక్షల డాలర్లుగా ఉంటుంది. అంటే మన భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.3.36 కోట్లు అన్నమాట. దీన్ని నెలవారీగా చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని నెల వారీగా చూస్తే ఇంచుమించు రూ.30 లక్షలు అందుతుంది. జీతంతో పాటు అధికారిక విధుల నిర్వహణకు అవసరమైన ఖర్చుల నిమిత్తం ఏడాదికి మరో 50,000 డాలర్లు (రూ.42 లక్షలు) అందుకుంటారు. ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన వారు తన అభిరుచికి అనుగుణంగా శ్వేతసౌధాన్ని మార్చుకునేందుకు వీలుగా ఒక్కసారి మాత్రమే లక్ష డాలర్లు (రూ.84 లక్షలు) కేటాయిస్తారు. అంతేకాకుండా ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు (రూ.84 లక్షలు), వినోదం కోసం రూ.19 వేల డాలర్లు (రూ.16 లక్షలు) కేటాయిస్తారు.
అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జీతం 2వేల డాలర్లు ఉండేది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ సంపదలో వృద్ధి, అధ్యక్షుల ఖర్చులు పెరిగిపోవడంతో జీతం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక చివరిసారిగా 2001లో అధ్యక్షుడి జీతం పెరిగింది. అప్పటి నుంచి అమెరికా ప్రెసిడెంట్ జీతం ఏడాదికి 4 లక్షల డార్లుగా కొనసాగుతోంది.
1789లో అధ్యక్షుడి జీతం 25,000 డాలర్లుగా ఉండేది
1873లో 50,000 డాలర్లు
1909లో 75,000 డాలర్లు
1949లో 100,000 డాలర్లు
1969లో 200,000 డాలర్లు
2001లో 400,000 డాలర్లు
సకల సౌకర్యాలు..
అధ్యక్షుడికి సకల సౌకర్యాలు అందుతాయి. వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుడు నివసించేందుకు అత్యంత విలాసవంతమైన అధికారిక భవనం శ్వేత సౌధం ఉంటుంది. ఇందులో అధ్యక్షుడి కుటుంబం మొత్తం నివసించొచ్చు. మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం విస్తరించి ఉంటుంది. ఇందులో వంట, ఇతర పనుల కోసం దాదాపు 100 మంది సహాయకులు ఉంటారు. ఇక అధ్యక్షుడికి భోజనాలు తయారు చేసేందుకు ప్రపంచంలోనే టాప్ షెఫ్‌లు ఉంటారు.
శ్వేతసౌధంతోపాటు బ్లెయిర్హౌస్ అనే అతిథి గృహం కూడా ఉంటుంది. ఇది శ్వేతసౌధం కంటే చాలా పెద్దది. ఇందులో ఏకంగా 119 గదులు, అతిథుల కోసం 20 బెడ్రూమ్లు, 35 బాత్రూమ్లు, 4 డైనింగ్ హాల్స్, జిమ్, సెలూన్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. క్యాంప్ డేవిడ్ అనే పర్వత విడిది కేంద్రం కూడా ఉంటుంది. దీన్ని ఎక్కువగా దౌత్యపరమైన చర్చల కోసం వినియోగిస్తుంటారు.
ప్రపంచంలోనే అత్యున్నత భద్రతో కూడిన ఎయిర్‌ఫోర్స్ వన్..
అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్నా.. అత్యంత భద్రతతో కూడిన వాహనాలనే వినియోగిస్తారు. అధ్యక్షుడికి అత్యంత విలాసవంతమైన. ప్రపంచంలోనే అత్యున్నత భద్రతతో కూడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ హెలికాప్టర్ కూడా ఉంటుంది. ఈ హెలికాప్టర్ భారీ పేలుళ్లను కూడా తట్టుకోగలదు. ఇలాంటివి అధ్యక్షుడికి ఐదు ఉంటాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత భద్రమైన ‘బీస్ట్’ కారులో అధ్యక్షుడు ప్రయాణిస్తుంటారు. ఇతర దేశాలకు వెళ్లినా సరే ఈ కారునే అధ్యక్షుడి వెంట తీసుకెళ్తుంటారు. అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఉచితంగా అందుతాయి.
ఇక అధ్యక్షుడిగా పదవీ విరమణ తర్వాత కూడా అనేక ప్రయోజనాలు పొందుతారు. మాజీ అధ్యక్షుడికి ఏడాదికి 2.30 లక్షల డాలర్ల పెన్షన్ అందుతుంది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. రూ.1.93 కోట్లన్నమాట. ప్రయాణ భత్యాలు, కోరుకున్న చోట నివాసం, సిబ్బంది వంటి సదుపాయాలు కూడా అందిస్తారు.
Also Read..
Donald Trump | ట్రంప్ ప్రమాణం నేడే.. శ్వేతసౌధ పీఠంపై మరోసారి
TikTok | టిక్‌టాక్ ఈజ్ బ్యాక్.. ట్రంప్ హామీతో యాప్ సేవల పునరుద్ధరణకు శ్రీకారం
Donald Trump | మరోసారి ఐకానిక్ స్టెప్పులతో ఆకట్టుకున్న ట్రంప్.. వీడియో
Donald Trump | అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. అక్రమ వలసలపై ట్రంప్ సంచలన ప్రకటన