Donald Trump | వాషింగ్టన్, జనవరి 19: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. దేశం రాజకీయంగా రెండుగా చీలిపోయిన తరుణంలో వైట్ హౌస్‌లోకి తిరిగి వస్తున్న ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుద్దాం అన్న తన నినాదాన్ని నిలబెట్టుకుంటారని ఆయన మద్దతుదారులు ఆశిస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వాషింగ్టన్లో గట్టి భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021లో డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓటమి పాలైన అనంతరం అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు తన మద్దతుదారులతో కలసి రాజధాని నగరంపై ట్రంప్ దండెత్తగా ఈసారి నిరసనలు, అశాంతి, హింస వంటి అవాంఛనీయ పరిణామాలేవీ జరగబోవని అధికారులు అంచనా వేస్తున్నారు.
గతానికి భిన్నంగా నగరం వేలాదిమంది ట్రంప్ మద్దతుదారుల సంబరాలతో సందడిగా మారింది. గత అధ్యక్ష ఎన్నికలలో బైడెన్ విజయం సాధించడంతో ఓటమి భారంతో ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి సైతం దూరంగా ఉన్న ట్రంప్ ప్రస్తుత 2024 ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలుపొందారు. 2012లో డెమోక్రట్ అభ్యర్థి బరాక్ ఒబామా తర్వాత అంతటి భారీ విజయం ట్రంప్‌కే దక్కడం విశేషం. అయితే రిపబ్లికన్ అభ్యర్థిగా విజయం సాధించి అధికార పీఠాన్ని ఎక్కనున్న ట్రంప్‌ను అమెరికా చరిత్రలోనే ఎవరికీ లేనంత మంది ప్రత్యర్థులతోపాటు మద్దతుదారులు కూడా ఉండడం గమనార్హం.
రాజకీయంగా తనను విభేదించేవారిని కలుపుకునిపోతూ తాను చేసిన ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోవడం ట్రంప్‌కు కత్తిమీద సాముగా మారనున్నది. అమెరికా అధ్యక్షుడిగా తాను చేసే తొలి ప్రసంగంలో ఐక్యతను సాధించడమే ప్రధాన అంశం కానున్నట్టు శనివారం ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న జో బైడెన్ శనివారం పూర్తి సమయం తన కార్యాలయంలో గడిపారు. గత వారంలో జరిగిన తన వీడ్కోలు సమావేశంలో బైడెన్ ప్రసంగిస్తూ దేశంలో సంపన్నుల ప్రయోజనాలను కాపాడే వ్యక్తులు అధికారంలోకి రావడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించబోతున్నట్లు తెలుస్తున్నది. చైనాతో సత్సంబంధాలను పటిష్టపరచుకోవాలని ఆయన కోరుకుంటున్నారని, అందుకే ఆయన పదవిని చేపట్టిన తర్వాత చైనాకు వెళ్లాలనుకుంటున్నారని సమాచారం. ఆయన భారత్‌లో పర్యటించడంపై కూడా తన సలహాదారుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. విదేశాంగ మంత్రి జైశంకర్ గత నెలలో వాషింగ్టన్కు వెళ్లినపుడు ట్రంప్ బృందంతో ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లతో కూడిన క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. ఈ వేసవి కాలంలో అమెరికాకు రావాలని మోదీని ట్రంప్ ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తున్నది.
అమెరికా అధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తొలి రోజే వందకు పైగా అధికారిక ఉత్తర్వులపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు)పై సంతకం చేయనున్నారు. వీటిలో చాలావరకు ఎన్నికల సందర్బంగా చేసిన వాగ్దానాలకు సంబంధించినవే ఉంటాయని తెలుస్తోంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో అధికారిక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్టు శనివారం ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. అధ్యక్షుడు ఏకపక్షంగా తనకు సంక్రమించిన అధికారాలతో జారీ చేసే ఉత్తర్వులను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లుగా వ్యవహరిస్తారు. దీనికి అమెరికన్ పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు. వీటిని పార్లమెంట్ తిరస్కరించే అధికారం లేనప్పటికీ న్యాయస్థానంలో వీటిని సవాలు చేయవచ్చు.