సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు పోరుబాట పట్టారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్ప వేరే మార్గం లేదంటూ తొమ్మిది సంఘాలు ఏకతాటిపైకి వచ్చి జేఏసీ ఏర్పడి ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. తమ సమస్యల పరిష్కారానికి ఆర్టిజన్లు సమ్మెకు రెడీ అయ్యారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా అన్ని జిల్లాల్లో సంతకాల సేకరణ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19061 మంది ఆర్టిజన్లు ఉండగా, అందులో టీజీ ట్రాన్స్‌కోలో 3769, జెన్కోలో 3583, ఎస్పీడీసీఎల్లో 8244, ఎన్పీడీసీఎల్లో 3465 మంది ఉన్నారు.
ఆర్టిజన్లు విద్యుత్లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, ప్యూజ్ఆఫ్కాల్ అటెండ్ చేయడం, కొత్త విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటు, మీటర్ల ఇన్స్టాలేషన్, రీడింగ్ నమోదు చేయడం, బ్రేక్‌డౌన్ సమయంలో పునరుద్ధరణ తదితర పనులు చేస్తున్నారు. ప్రస్తుతం వీరికి ప్రారంభవేతనం 15 వేల నుంచి గరిష్ఠంగా 25వేల వరకు ఉంది. తమను రెగ్యులర్ కార్మికులుగా మార్చాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారులు మాత్రం ఇందుకు అర్హతలు ఉండాలని చెప్పడంతో సీనియార్టి ప్రకారం కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టిజన్లు కన్వర్షన్‌కు నోచుకోకపోవడంతో సర్వీస్ రూల్స్ రూపొందించలేదు. దీంతో వారికి ఏవీ వర్తించడం లేదు.
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందితో సమానంగా ఆర్టిజన్లు ప్రయోజనాలు పొందడం లేదు. ఆర్టిజన్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అం దడం లేదు. సెలవులు అమలు కావడం లేదు. పే స్కేల్ చాలా తక్కువగా ఉంది. కానీ రెగ్యులర్ ఉద్యోగులతో కలిసి పనిచేస్తున్నా గ్రా ట్యుటీ, అరకొరవేతనమే అందుతున్నది. పేరుకు కోటిరూపాయల ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నా వందల మంది కార్మికులు చనిపోతే ఒకరికి మాత్రమే కోటి రూపాయల ఇన్యూరెన్స్ ఇస్తున్నారు. ప్రమాదాలు, బారినపడి కార్మికులు చనిపోతే పరిహారం నామమాత్రంగా ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.
నేడు మింట్‌కాంపౌండ్‌లో మహాధర్నా..!
విద్యుత్ సంస్థల పరిధిలోని ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికులు కొన్నిరోజులుగా పలురకాల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సర్కార్ నుంచి స్పందన లేకపోవడంతో పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఈజేఏసీ) ఆధ్వర్యంలో ఈనెల 10న మింట్‌కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట మహాధర్నాకు సిద్ధమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల మధ్య సీఎండీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ సాయిలు ఒక ప్రకటనలో తెలిపారు.