TikTok | ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) అగ్రరాజ్యం అమెరికాలో మూగబోయిన విషయం తెలిసిందే. జనబాహుల్యంలో విశేష ఆదరణ పొందిన ఈ షార్ట్ వీడియో యాప్‌ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం ఆదివారం నుంచే అమల్లోకి రావడంతో తన సేవలను సంస్థ ఒకరోజు ముందే నిలిపివేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ శనివారం ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే టిక్‌టాక్ మరో ప్రకటన చేసింది. యూజర్లకు తిరిగి సేవలను పునరుద్దరించే (TikTok began restoring its services) ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ఈ మేరకు ‘యూఎస్‌లో టిక్‌టాక్ ఈజ్ బ్యాక్’ అంటూ పోస్టు పెట్టింది.
టిక్‌టాక్ సేవలకు సంబంధించి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టిక్‌టాక్ కంపెనీలో కనీసం 50 శాతం వాటా అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా షరతులు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వాటి సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. తన ప్రమాణం తర్వాత ఈ ఆర్డర్ పై సంతకం చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. అయితే, 50 శాతం షరతుకు అంగీకరించాలని సూచించారు. తాము తమ వ్యాపారాన్ని చైనాకు గానీ, ఇతరులకు గానీ అప్పగించాలని అనుకోవడం లేదన్నారు. ఇలా చేయడం ద్వారా తమ దేశ పౌరుల డేటా చైనాకు చేరుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
ట్రంప్ ప్రకటనపై టిక్‌టాక్ స్పందించింది. అమెరికాలో తమ సేవలు పునరుద్ధరణపై ట్రంప్ నుంచి భరోసా లభించడంతో ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఓ ట్వీట్ పెట్టింది. ‘మా సర్వీస్ ప్రొవైడర్లతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. అమెరికాలో తిరిగి టిక్‌టాక్ సేవలను పునరుద్ధరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విషయంలో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సర్వీస్ ప్రొవైడర్లు ఎదుర్కొనే పెనాల్టీలపై ఆయన హామీ ఇచ్చారు. ఫలితంగా 17 కోట్ల మంది అమెరికన్లకు టిక్ టాక్ సేవలు అందుతాయి. 70 లక్షల చిన్న వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇది ఏకపక్ష సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా ట్రంప్ ఇచ్చిన బలమైన స్టాండ్. టిక్‌టాక్‌ను తిరిగి కొనసాగిస్తూ దీర్ఘ కాలిక పరిష్కారాల కోసం అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పని చేస్తాం’ అని తెలిపింది. మరో సందేశంలో ‘అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాల ఫలితంగా.. అమెరికాలో టిక్‌టాక్ ఈజ్ బ్యాక్’ అని పేర్కొంది.
STATEMENT FROM TIKTOK:
In agreement with our service providers, TikTok is in the process of restoring service. We thank President Trump for providing the necessary clarity and assurance to our service providers that they will face no penalties providing TikTok to over 170…
— TikTok Policy (@TikTokPolicy) January 19, 2025
2017లో ప్రారంభమైన టిక్‌టాక్‌ను భారత్ సహా అనేక దేశాలు ఇప్పటికే నిషేధించారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా దీని వినియోగంపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందేనంటూ అమెరికా ప్రతినిధుల సభ ఇటీవల ఒక బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా జనవరి 19 లోగా యూఎస్ టిక్‌టాక్‌ను విక్రయిస్తారా? లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా? ఏదో ఒకటి నిర్ణయించుకోవాలంటూ అమెరికా సుప్రీం కోర్టు బైట్‌డ్యాన్స్‌కు డెడ్‌లైన్ విధించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలోనే దేశంలో తన సేవలను నిలిపివేస్తున్నట్లు తాజాగా ఆ సంస్థ ప్రకటించింది. అయితే ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత టిక్‌టాక్ పునరుద్ధరణకు ప్రయత్నించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ క్రమంలో ట్రంప్‌నుంచి భరోసా లభించడంతో అమెరికాలో తమ సేవలు పునరుద్ధరణకు టిక్‌టాక్ శ్రీకారం చుట్టింది.
Also Read..
అమెరికాలో టిక్‌టాక్ నిలిపివేత
TikTok | అమెరికాలో నిలిచిన టిక్‌టాక్ సేవలు..
Donald Trump | ట్రంప్ ప్రమాణం నేడే.. శ్వేతసౌధ పీఠంపై మరోసారి