వాషింగ్టన్: Sorry, TikTok isn’t Available right now.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ స్క్రీన్ షాట్ తెగ షేరింగ్ అవుతున్నది. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) అగ్రరాజ్యం అమెరికాలో తన సేవలను నిలిపివేసింది. జనబాహుల్యంలో విశేష ఆధరణ పొందిన ఈ షార్ట్ వీడియో యాప్‌ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో తన సేవలను నిలిపివేస్తున్నట్లు స్వయంగా ఆ కంపెనీ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు తన సేవలను మూసివేస్తున్నట్లు మెసేజ్‌లు పంపిస్తున్నది. సరిగ్గా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం స్వీకారం చేయనున్న ఒక్క రోజు ముందే టిక్టాస్ సేవలు నిలిచిపోవడం గమనార్హం.
అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం జనవరి 19 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం అంటూ టిక్‌టాక్ తన వినియోగదారులకు సందేశం పంపించింది. కాగా, 2017లో ప్రారంభమైన టిక్‌టాక్‌ను భారత్ సహా అనేక దేశాలు ఇప్పటికే నిషేధించారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా దీని వినియోగంపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందేనంటూ అమెరికా ప్రతినిధుల సంభ ఇటీవల ఒక బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా జనవరి 19 లోగా యూఎస్ టిక్‌టాక్‌ను విక్రయిస్తారా? లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా? ఏదో ఒకటి నిర్ణయించుకోవాలంటూ అమెరికా సుప్రీం కోర్టు బైట్‌డ్యాన్స్‌కు డెడ్‌లైన్ విధించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలోనే దేశంలో తన సేవలను నిలిపివేస్తున్నట్లు తాజాగా ఆ సంస్థ ప్రకటించింది. అయితే ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత టిక్‌టాక్ పునరుద్ధరణకు ప్రయత్నించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.