హూస్టన్, జనవరి 19: నిషేధ ఉత్తర్వులు అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ అమెరికాలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. శనివారం రాత్రి టిక్‌టాక్ అమెరికా నుంచి నిష్క్రమించింది. టిక్‌టాక్‌ను నిషేధిస్తూ అమెరికాలో ఓ చట్టం రావడం దురదృష్టకరమని, ఇప్పటికి మీరు టిక్‌టాక్‌ను ఉపయోగించలేరంటూ అమెరికాలో ఈ యాప్‌ను ఓపెన్ చేసిన యూజర్లకు ఓ మెసేజ్ దర్శనమిస్తోంది.
తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టిక్‌టాక్‌ను పునరుద్ధరించేందుకు పరిష్కారం కనుగొంటానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తమ అదృష్టంగా ఆ మెసేజ్ పేర్కొంది. కాగా, టిక్‌టాక్ మూసివేత ప్రకటనను నాటకంగా బైడెన్ ప్రభుత్వం అభివర్ణించింది. టిక్‌టాక్ నిషేధం అమలు బాధ్యత రానున్న ట్రంప్ ప్రభుత్వానిదేనని బైడెన్ ప్రభుత్వం తెలిపింది. స్పష్టమైన హామీలు లేకుండా అమెరికాలో తమ కార్యకలాపాలు కొనసాగించలేమని, మూసివేత ఒక్కటే తమకు మార్గమని టిక్‌టాక్ తెలిపింది.