Donald Trump | ఖతార్ (Qatar) రాజధాని దోహా (Doha)లో హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) వైమానిక దళం గత వారం భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని చెప్పారు. ఖతార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ‘నెతన్యాహు.. ఖతార్ విషయంలో జాగ్రత్త. అది అమెరికాకు చాలా ముఖ్యమైన మిత్రదేశం. హమాస్‌పై ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఖతార్ జోలికి మాత్రం వెళ్లొద్దు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి’ అని హెచ్చరించారు.
గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా (US) చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు గత వారం దోహాలో హమాస్ కీలక నేతలు సమావేశమయ్యారు. ఆసమయంలో హమాస్ నేతలపై ‘సమ్మిట్ ఆఫ్ ఫైర్’ పేరుతో ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడింది. . ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ దాడికి బాధ్యత వహించింది. హమాస్ అగ్రశ్రేణి ఉగ్రవాద నాయకులపై నేటి చర్య పూర్తిగా స్వతంత్ర ఆపరేషన్ అని.. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించి.. నిర్వహించిందని.. దీనికి ఇజ్రాయెల్ పూర్తి బాధ్యత వహిస్తుందని పీఎం కార్యాలయం పేర్కొంది.
ఖతార్ స్టేట్ ప్రసార సంస్థ అల్ జజీరా దాడులను ధ్రువీకరించింది. ఈ క్రమంలోనే తమ వైమానిక దళం హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హమాస్ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా ఈ దాడిలో చనిపోయాడని అల్ అరేబియా తెలిపింది. ఇజ్రాయెల్ దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిచర్య అని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. ఇజ్రాయెల్ అనాలోచిత చర్యలను సహించబోమని హెచ్చరించింది.
Also Read..
లష్కరే ఆఫీస్ పునర్నిర్మాణానికి పాక్ నిధులు!
గొప్పలు చెప్తుంది.. గంపెడు జొన్నలు కొనదు