లండన్: బ్రిటన్లోని వలసదారులకు వ్యతిరేకంగా, అనుకూలంగా శనివారం లండన్లో జరిగిన రెండు ర్యాలీలు ఉద్రిక్తంగా మారాయి. ‘వలస వ్యతిరేక ర్యాలీ’లో లక్ష మందికిపైగా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ‘బ్రిటన్ ఇప్పుడు అక్రమ వలసలతో నిండిపోయింది. హింసను కోరుకోకపోయినా..విధ్వంసం మీ వరకు వస్తుంది.
ఇప్పుడు మీ వద్ద ఉన్నవి రెండే మార్గాలు. తిరిగి పోరాడండి. లేదంటే చనిపోతారు’ అని మస్క్ అన్నారు. మరోవైపు వలసదారులకు మద్దతుగా ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ పేరుతో మరొక గ్రూప్ నిరసనలు చేపట్టింది. ఈ రెండు నిరసనలు అదుపు తప్పడంతో హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనల్లో 26 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రదర్శన చివరి దశలో కొంతమంది అదుపు తప్పారు.