న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఏడాది మే 7న భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో మురిద్కేలోని లష్కరే తాయిబా (ఎల్ఈటీ) ప్రధాన కార్యాలయం మార్కజ్ తాయిబా పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో ఉగ్రవాదుల ఆయుధాగారాలు, శిక్షణ కేంద్రాలు నాశనమయ్యాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్ ఈ ఉగ్రవాద సంస్థ పునర్నిర్మాణానికి నేరుగా నిధులు సమకూరుస్తున్నట్టు తెలిసింది.
లష్కరేకు ప్రభుత్వం ఇప్పటికే రూ.4 కోట్లు కేటాయించింది. మొత్తం పునర్నిర్మాణానికి రూ.15 కోట్లకు పైగా ఖర్చవుతుందని సంస్థ అంచనా వేస్తున్నది. లష్కరే కమాండర్లు మౌలానా అబూ జార్, యూనస్ షా బుఖారీ ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు.