బుధవారం 05 ఆగస్టు 2020
International - Aug 01, 2020 , 17:05:21

వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కు త‌ప్ప‌ద‌ట‌!

వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కు త‌ప్ప‌ద‌ట‌!

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే వ్యాక్సిన్ త‌ప్ప మ‌రో మార్గం లేక‌పోవ‌డంతో.. వివిధ దేశాల శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప‌నిలోపడ్డారు. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చినా ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం అనేవి కీల‌కంగా మారుతాయ‌ని ఆమెరికాకు చెందిన మ‌రియా ఎలెనా బొటాజ్జీ అనే శాస్త్ర‌వేత్త పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ల అభివృద్ధికి సంబంధించి అమెరికాలోని ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌ల్లో ఒక‌రైన బొటాజ్జీ.. బిజినెస్ ఇన్‌సైడ‌ర్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యం చెప్పారు. 

క‌రోనా వ్యాక్సిన్ వ‌ల్ల మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గుతుందేమోగానీ, పూర్తిగా నిర్మూల‌న కాద‌ని బొటాజ్జీ అభిప్రాయ‌ప‌డ్డారు. క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల ద్వారా కూడా వైర‌స్ ఇత‌రుల‌కు సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పారు. క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే మునుప‌టిలాగే ఇప్పుడు కూడా త‌మ ప‌నులు తాము చ‌క్క‌బెట్టుకోవ‌చ్చ‌ని ఎవ‌రైనా అనుకుంటే పొర‌ప‌డిన‌ట్లేన‌ని బొటాజ్జీ పేర్కొన్నారు. 

కాగా, కరోనా మ‌హ‌మ్మారి నిర్మూల‌న కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 150 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో 26 వ్యాక్సిన్‌లు మ‌నుషుల‌పై ట్ర‌య‌ల్స్ ద‌శ‌కు చేరుకున్నాయి. ఆ 26 వ్యాక్సిన్‌ల‌లో ఐదు వ్యాక్సిన్‌లు క్లినిక‌ల్ ట్రయ‌ల్స్‌లో ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఆఖ‌రి ద‌శ‌లో వివిధ వ‌య‌సుల‌కు చెందిన వేల‌మంది వాలెంటీర్‌లకు టీకాలు ఇచ్చి దాని భ‌ద్ర‌త‌, స‌మ‌ర్థ‌త‌ను ప‌రీక్షిస్తారు.       

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo