నల్లగొండ, మే 3 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి ఉప ఎన్నికలో భాగంగా శుక్రవారం రెండో రోజు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) 2 సెట్లు, అలియన్స్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా ఈడ శేషగిరిరావు 1 సెట్, తెలంగాణ సకలజనుల పార్టీ అభ్యర్థిగా నందిపాటి జానయ్య 1 సెట్, స్వతంత్ర అభ్యర్థులుగా మాధవపెద్ది వెంకట్ రెడ్డి 1 సెట్, చాలిక చంద్రశేఖర్ 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.
వీరు నల్లగొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సీహెచ్ మహేందర్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుండగా 10న స్క్రూటినీ, 13న ఉపసంహరణ ఉంటుంది. తీన్మార్ మల్లన్న నల్లగొండలో భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఆయన వెంట రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నకిరేకల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నారు.