తుంగతుర్తి, మే 3 : కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారని, అనేక హామీలు ఇచ్చి ఆ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఓ ఫంక్షన్హాల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని, బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని, వారి మాయ మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు నీరందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్య రీతిలో ప్రజలు నీరాజనం పలుకుతుంటే ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసి 48 గంటల ప్రచారాన్ని నిలిపివేశారని తెలిపారు.
ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు నీళ్లు ఇవ్వక పంటలు ఎండబెట్టిందని, 24గంటలు కరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నదని మండిపడ్డారు. తుంగతుర్తి నియోజవకర్గంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి హయాంలో ఏ గ్రామానికి వెళ్లినా గోరీలే తప్ప అభివృద్ధి జరుగలేదని విమర్శించారు. గ్రామాల్లో ప్రస్తుతం కనీసం మంచినీటి సమస్య పరిష్కరించే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టడం లేదని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ మంచినీటిని అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని చెప్పారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాము ఎవరినీ హింసించలేదని, ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడం, దాడులు చేయడం తగదని అన్నారు. ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ సారే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంంగ్రెస్, బీజేపీ మాయ మాటలు నమ్మొద్దని, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో సూర్యాపేట, యాదాద్రి జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికాయుగంధర్‌రావు, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్, ఎంపీపీ గుండగాని కవితరాములుగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు దొంగరి శ్రీను, గుండగాని రాములుగౌడ్, తునికి సాయిలుగౌడ్, తునికి లక్ష్మమ్మ, సత్యనారాయణగౌడ్, తడకమల్ల రవికుమార్, శ్రీకాంత్, వెంకటేశ్, మధు, దుర్గయ్య, శ్రీహరి, యాదగిరిగౌడ్, పూర్ణ నాయక్ పాల్గొన్నారు.