Israel vs Iran : ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ (Iran) దేశాల మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుండగా.. ఇజ్రాయెల్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడుల (Missile attacks) కు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ ‘మొస్సాద్ (Mossad)’ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడింది. అత్యంత కచ్చితత్వంతో మొస్సాద్పై బాంబుల వర్షం కురిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అంతేకాకుండా గ్లిలాట్లోని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్‌పైనా క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.
ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో ఇరాన్‌పై దాడులు చేస్తోందంటే అందుకు కారణం కచ్చితంగా మొస్సాద్ సంస్థే. ఇరాన్లో అణుస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి నుంచి.. కీలక అధికారులు, శాస్త్రవేత్తల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ‘మొస్సాద్’ ఇజ్రాయెల్‌కు చేరవేసింది. ముందుగానే ఇరాన్‌కు భారీ మొత్తంలో డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడం వెనుకా మొస్సాద్ హస్తం ఉంది.
ఈ నేపథ్యంలోనే మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికాలకు సమాచారం ఇచ్చిన ఇరాన్.. దాడులను మాత్రం ఆపడంలేదు. ఇరుదేశాల మధ్య మొదలైన ఈ ఘర్షణపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితులు కన్పిస్తున్నాయి.