Girl death : పంటి చికిత్స (Dental procedure) కోసం మత్తు ఇంజక్షన్ (Anaesthesia) ఇస్తే తొమ్మిదేళ్ల బాలిక దుర్మరణం పాలైంది. మత్తు ప్రభావం తగ్గకముందే డెంటల్ క్లినిక్ (Dental clinic) వాళ్లు బాలికను ఇంటికి పంపించడంతో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోగల శాన్ డియాగో కౌంటీ (San Diego County) లో గత మార్చి 18న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మార్చి 18న బాలికను ఆమె కుటుంబసభ్యులు విస్టాలో డ్రీమ్‌లైన్ డెంటిస్ట్రీకి తీసుకెళ్లారు. అక్కడ పంటిచికిత్స ముందు బాలికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన వైద్యులు.. చికిత్స అనంతరం ఆమెను రికవరీ రూమ్‌కు పంపించారు. కొద్దిసేపటి తర్వాత రికవరీ రూమ్ నుంచి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా బాలిక స్పృహలోకి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు ఆస్పత్రి తరలించారు.
పరిశీలించిన వైద్యులు బాలిక మరణించినట్లు ధృవీకరించారు. మత్తు ఇంజక్షన్ వల్ల బాలిక ‘మెథమోగ్లోబినేమియా (Methemoglobinemia)’ అనే రక్తసంబంధ రుగ్మతకు లోనైందని, అదే ఆమె ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని వైద్యులు తెలిపారు. ఈ మెథమోగ్లోబినేమియా కారణంగా కణాలు, కణజాలాలకు ఎర్రరక్త కణాలు ఆక్సిజన్‌ను సమకూర్చే ప్రక్రియపై ప్రభావం పడుతుందని చెప్పారు. ముందే గుర్తించి సంబంధిత మెడికేషన్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చన్నారు.
ఈ మెథమోగ్లోబినేమియాను కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చని వైద్యులు చెప్పారు. అవి.. చర్మం నీలం రంగులోకి మారుతుంది. ముఖ్యంగా పెదవులు, వేళ్లు నీలం రంగులోకి మారుతాయి. రక్తం రంగు కూడా బ్రౌనిష్ అవుతుంది. పరిస్థితి తీవ్రమైతే.. శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. తల తిరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. వాంతికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత స్పృహ తప్పుతుంది.
కాగా మోతాదుల్లో తేడావల్ల మత్తు ఇంజక్షన్ తీసుకున్న పేషెంట్లు మెథమోగ్లోబినేమియాకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.