Benjamin Netanyahu | అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి రెండు రోజుల్లో దాడులకు తెగబడింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఆపరేషన్ ‘మిడ్నైట్ హ్యామర్’ పేరిట ఎంతో పకడ్బందీగా జరిపిన ఈ దాడులను 25 నిమిషాల్లో ముగించింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం (Israel-Iran War)తో ఇప్పటికే రగులుతున్న పశ్చిమాసియా.. ఇప్పుడు యూఎస్ ఎంట్రీతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కీలక ప్రకటన చేశారు.
ఇరాన్‌పై తాము చేపట్టిన దాడుల్లో లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు. దీంతో టెహ్రాన్‌తో సుదీర్ఘ యుద్ధం ఉండదని అన్నారు. టెహ్రాన్‌లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా తీవ్రంగా ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి, అణు కేంద్రాలకు గణనీయమైన నష్టం కలిగించినట్లు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా దాడుల తర్వాత నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. ‘ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రానికి అమెరికా చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్‌ను వెనక్కి నెట్టాం. ముప్పును తొలగించాం. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోం. మా టార్గెట్‌ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తైనట్లే. అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది. ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు. అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. మాకు పొంచి ఉన్న రెండు ముప్పులను తొలగించాలనుకున్నాం. అందులో భాగంగానే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి, అణు కేంద్రాలకు గణనీయమైన నష్టం కలిగించి లక్ష్యాలను చేరువయ్యాం. ఇరాన్‌తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోం’ అని నెతన్యాహు వెల్లడించారు.
Also Read..
Iran Nuclear Site | అమెరికా దాడిలో దెబ్బతిన్న ఫోర్డో అణుకర్మాగారం.. ఉపగ్రహ చిత్రాలు
Donald Trump | బీ-2 బాంబర్లు మిస్సోరిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి : ట్రంప్